యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) ;రానున్న పార్లమెంట్ ఎన్నికలకు అంతా సన్నద్ధమవుతున్నారు. అటు అధికార యంత్రాంగం.. ఇటు రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఎవరి పనుల్లో వారు బిజీ అవుతున్నారు. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. వచ్చే వారం తర్వాత వివిధ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత అధికారులు ఎన్నికల పనుల్లోనే తలమునకలు కానున్నారు. మరోవైపు బరిలో నిలిచేందుకు పలువురు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. అటు అధిష్టానం మెప్పు, ఇటు ప్రజల్లో ప్రాచుర్యం పొందడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. మన దగ్గర భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఉంది. దీని పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. భువనగిరి, ఆలేరు, జనగాం, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీలు ఉన్నాయి. భువనగిరి కేంద్రంగా ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, కార్యకలాపాలు ఉండనున్నాయి. ఇక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా సిద్ధం అవుతున్నారు. ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లనున్నారు. వచ్చే వారంలో ఎన్నికల సంఘం నుంచి వివిధ అంశాలపై ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వచ్చే వారం ఎన్నికలకు సంబంధించి పలు కమిటీలను నియమించనున్నారు. దాంతో ఆయా కమిటీలకు వివిధ పనుల్లో నిమగ్నం కానున్నాయి. ప్రతి రోజు సమావేశాలు, సమీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా అధికారులతో రివ్యూలు చేపడుతూ సలహాలు, సూచనలు చేయనున్నారు.
ఓటరు నమోదు షురూ..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొత్త ఓటర్ల నమోదుతోపాటు మార్పులు, చేర్పులకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. తుది జాబితా కూడా విడుదల చేసింది. ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరో సారి కొత్త ఓటర్ల ప్రక్రియకు మరో ఛాన్స్ ఇచ్చింది. ఈ మేరకు ఇటీవల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. 2024 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. జనవరి 5వ వరకు కొత్త దరఖాస్తుల స్వీకరణ, మార్పులు, చేర్పులుకు అవకాశం ఉంది. జనవరి 6న ఓటరు ముసాయిదా జాబితా, 8న తుది జాబితాను ప్రకటించనున్నారు.
మెప్పు కోసం నేతల ప్రయత్నాలు..
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు నేతలు నానాతంటాలు పడుతున్నారు. అటు పార్టీల అధిష్టానం మెప్పు పొందేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. తాము టికెట్ రేస్‌లో ఉన్నామని, తమకే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. స్థానికంగా నేతలతో సైతం తమకే టికెట్ వస్తుందని పలువురు నేతలు బహిరంగంగా చెప్పడం గమనార్హం. మరోవైపు జనంలోకి వెళ్లేందుకు సదరు నేతలు పాట్లు పడుతున్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు తమవంతు కార్యక్రమాలు చేపడుతున్నారు.
రాజకీయ పార్టీల ఫోకస్..
ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఎలాగైనా ఎంపీ సీటును కైసవం చేసుకోవాలని కార్యాచరణ రూపొందిస్తున్నాయి. అధిష్టానాలు ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులపై ఆరా తీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా భువనగిరి ఇన్చార్జ్గా ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించింది. బీఆర్ఎస్ పార్టీ భువనగిరిపై స్పెషల్ ఫోకస్ పెట్టి, పలువురు నేతలతో సమాలోచనలు చేసినట్లుగా తెలిసింది. బీజేపీ వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నది.