– ఎన్నికల వాగ్ధానాలు అమలు చేయకపోతే నిరవధిక సమ్మె
– సీఐటీయు నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీం
నీలగిరి, జూలై 18 : ఎన్నికల సందర్భంగా వీవోఏలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని కోరుతూ ఐకేపీ వీవోఏల సంఘం ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. సమస్యలను పరిష్కారించాలని, ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని పెద్ద ఎత్తున వివాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి ఎండీ సలీం మట్లాడుతూ.. తెలంగాణ ఐకెపి వివోఏ ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన రూ.18 వేల వేతన హామీ, ఇతర వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనాలతో అర్థాకలితో వివోఏలు పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీవోఏలకు సంబంధం లేని బుధవారం రివ్యూ మీటింగ్స్, ఉల్లాస్ యాప్ లో పని ఆపాలని, ఆన్లైన్ పని ఆపాలని కోరారు. ప్రమాద బీమా రూ.10 లక్షలు, టాప్స్ నెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారం అయ్యేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. సమస్యలను పరిష్కరించకపోతే త్వరలో నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు.
జిల్లా గౌరవ అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చిలుముల దుర్గయ్య, పి.సులోచన మాట్లాడుతూ వీవోఏల సమస్యలన్నీ పరిష్కరించకపోతే ఈ నెల 27న కలెక్టరేట్ ముట్టడి అనంతరం సమరశీల పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు దండంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి పెంజర్ల సైదులు, జిల్లా నాయకులు పోలె సత్యనారాయణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.వెంకన్న, యూనియన్ జిల్లా నాయకులు కె.రేణుక, బి.సురేష్, కె.చంద్రకళ, రాందాస్, వై.పాపయ్య, వల్లపు రాజేశ్వరి, జిల్లపల్లి మంగ, కాసర్ల సువర్ణ, జటావత్ సరోజ, బుర్రి రేణుక, పద్మ, ఆర్ బి నాయక్, ధనలక్ష్మి, సుజాత, రాజు, సైదులు, సైదమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.