సూర్యాపేటటౌన్, ఆగస్టు 17 : జిల్లా ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేశ్ నవరాత్రులు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. భద్రత, బందోబస్తు కోసమే గణేశ్ ఆన్లైన్ నమోదు విధానం ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్ర పోలీస్ వెబ్సైట్లో గణేశ్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులకు సంబంధించిన అనుమతి కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో గణేశ్ మండపాల ఏర్పాటు, నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో అనుమతి తీసుకోవడం వల్ల మండపాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే పూర్తి సమాచారం పోలీసుల వద్ద ఉంటుందన్నారు. ఉత్సవాలు ముగిసే వరకు పోలీసు భద్రత కల్పించడం సులభంగా ఉంటుందన్నారు.
మండపాల నిర్వహణ, మండపాలకు సంబంధించిన సమాచారం సులభతరం అవుతుందని, తద్వారా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడవచ్చన్నారు. పోలీసు శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. అలాగే మండపాల నిర్వాహకులు పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. గణేశ్ మండపాలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని మండపాల్లో క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించుకోవాలన్నారు. ఒకవేళ మండపాల వద్ద అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ముందు జాగ్రత్తగా సమీపంలో నీళ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గణేష్ మండపాల వద్ద మద్యం తాగడం, పేకాట ఆడటం, అసభ్యకర నృత్యాలు చేయడం, అన్యమతస్తులను కించపరిచే ప్రసంగాలు చేయడం, పాటలు పాడడటం నిషేధమన్నారు. నిర్వాహకులు పోలీసుల తనిఖీలకు సహకరించాలని, పాయింట్ బుక్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.