కట్టంగూర్, ఆగస్టు 22 : రైతులకు సకాలంలో యూరియా అందజేయాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కట్టంగూర్ అమరవీరుల స్మారక భవనంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు పడుతున్న సమయంలో రైతులకు ఎరువులు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. రాష్ట్రంలో 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా కేవలం 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రైతులకు పంపిణీ చేశారన్నారు. యూరియా కోసం రైతులు పీఏసీఎస్, ఎరువుల దుకాణాల ఎదుట రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదన్నారు. రైతులకు తగినంత యూరియా అందజేయాలని, లేకుంటే రైతు ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, మండల కమిటీ సభ్యులు మురారి మోహన్, గుడుగుంట్ల రామకృష్ణ, ఊటూరి యాదయ్య, రమేశ్, మాద సైదులు, గడగోజు రవీంద్రాచారి, ఊట్కూరి సుజాత పాల్గొన్నారు.