– 140 బస్తాల యూరియా పక్కదారి
– రైతుల కండ్లముందే కాంగ్రెస్ కార్యర్తలకు పంపిణీ
కట్టంగూర్, ఆగస్టు 26 : యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పాట్లు పడుతుంటే వచ్చిన యూరియా సజావుగా రైతులకు అందచేయాల్సిన వ్యవసాయ, సింగిల్ విండో అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పంపిణీ చేశారు. ఇదేంటని అడిగిన రైతులపై కక్ష సాధింపుగా వ్యవహరించారు. కట్టంగూర్ పీఏసీఎస్‌కు మంగళవారం ఉదయం 440 బస్తాల యూరియా రావడంతో విషయం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకున్నారు. 440 బస్తాలకు రైతుకు రెండు బస్తాల చొప్పున పాస్‌బుక్ సీరియల్ పెట్టిన 220 మంది రైతుల పేరన్లు సీరియల్ ప్రకారం నమోదు చేసుకున్నారు. అట్టి లిస్ట్‌ను వ్యవసాయ అధికారులు, సింగిల్ విండో సిబ్బందికి అందజేశారు.
వ్యవసాయ శాఖ అధికారి గిరి ప్రసాద్, పీఏసీఎస్ సీఈఓ మల్లారెడ్డి పర్యవేక్షణలో ఒక దశలో పోలీస్ పహారాలో సీరియల్ ప్రకారం పంపిణీ సజావుగా జరిగింది. 70 మంది రైతులకు పంపిణీ చేసిన అనంతరం సీఈఓ మల్లారెడ్డి, వ్యవసాయ అధికారులు, సింగిల్ విండో సిబ్బంది తమ కోటాల వారిగా సీరియల్ ప్రకారం కాకుండా కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలు రైతుల కళ్లముందే 5 నుంచి 10 బస్తాల వరకు అందజేశారు. దీంతో 150 మంది రైతులకే యూరియా పంపిణీ చేయడంతో వచ్చిన స్టాక్ అయిపోయింది. ఇంకా 70 మందికి పంపిణీ చేయాల్సిన 140 బస్తాల యూరియా ఎక్కడిపోయిందని రైతులు అధికారులను అడిగినా వారి నుండి సమాదానం దొరక్కపోవడంతో తిరిగి ఉత్తి చేతులతో వెళ్లి పోయారు. రైతులకు అందజేయకుండా యూరియాను పక్కదారి పట్టించిన సీఈఓ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.