మిర్యాలగూడ, ఆగస్టు 3 : అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు బూటకపు జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడని నిరుద్యోగులు భగ్గుమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అసంపూర్తి జాబ్ క్యాలెండర్‌ను నిరసిస్తూ శనివారం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల నిరసన తెలిపారు.
బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.యాదగిరిగుట్టలో చేపట్టిన ఆందోళనలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ షోయబ్ మాట్లాడుతూ పోస్టులు, నోటిఫికేషన్, పరీక్ష తేదీలు లేకుండా అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సిగ్గు చేటన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాల పేరిట తెలంగాణ యువతను మోసం చేసిన రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
జాబ్ క్యాలెండర్‌కు మొదటి క్యాబినేట్‌లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేశాడని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ మిర్యాలగూడ మండలాధ్యక్షుడు అంజియాదవ్, నాయకులు దస్రూనాయక్, కిరణ్, మల్లేశ్, మహేశ్, శివనాయక్ పాల్గొన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, అడ్డగూడూరులోనూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.