కోదాడ, జూన్ 27 : కోదాడ మున్సిపల్ పరిధిలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై శ్రీరంగపురం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి దుర్మరణం చెందారు. మృతులను బీహార్ రాష్ట్రానికి చెందిన రాజేష్, శివాజీగా గుర్తించారు. పట్టణ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యువకులు గత రెండు సంవత్సరాలుగా కోదాడలోని ఓ రైస్ మిల్లులో హమాలీలుగా పని చేస్తున్నారు. అయితే శనివారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై డ్రైవింగ్ చేస్తూ జాతీయ రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో వీరు చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో యువకులు మద్యం సేవించి ఉన్నట్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు.