కట్టంగూర్, మార్చి 20 : పంటలు నష్ట పోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుని నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఎరసానిగూడెం, దుగినవెల్లి గ్రామాల్లో పొలంబాట కార్యక్రమంలో భాగంగా సాగునీరందక ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.
రైతులు ఎకరానికి రూ.40 వేల పెట్టుబడి పెట్టి వరి సాగు చేశారని, తీరా చేతికొచ్చే సమయంలో సాగు నీరందక పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతున్నారన్నారు. ఎండిపోయిన పంటలను అధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడంలో విఫలం చెందారని విమర్శించారు. ఎకరానికి రూ.30 వేల నష్ట పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నీలం నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు మండల ఎంకన్న, నాయకులు పాదూరి వెంకట్రెడ్డి, పులకరం శంకర్, పబ్బు వెంకటేశ్వర్లు, గున్నాల నాగరాజు, బత్తిని నాగరాజు, గంజి ఆంజనేయులు, కొరివి నాగరాజు పాల్గొన్నారు.