Face Oils | ముఖ సంరక్షణకు చాలా మంది ఫేస్ ఆయిల్స్ ను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల చర్మ ఆకృతి మెరుగుపడుతుంది. చర్మం పొడి బారకుండా ఉంటుంది. తేమ పునరుద్దరించి చికాకును తగ్గిస్తాయి. అయితే చాలా మంది సరైన ఫేస్ ఆయిల్స్ ను ఎంచుకోవడంలో విఫలమవుతున్నారని చెప్పవచ్చు. తగిన నూనెలను ఎంచుకోని కారణంగా ముఖం జిడ్డుగా తయారవుతుంది. ఒక్కొక్కరు ఒక్కోరకమైన చర్మాన్ని కలిగి ఉంటారు. కనుక ఎవరైనా సరే ఎంచుకునే నూనెలు చర్మానికి సరిపోవాలి. సున్నితమైన చర్మం కలిగిన వారు కొద్దిగా చర్మానికి రాసుకుని ముందే పరీక్షించుకోవాలి. చర్మ సంరక్షణను మెరుగుపరిచే వివిధ రకాల ఫేస్ ఆయిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్క్వాలేన్ ఆయిల్ అన్ని రకాల చర్మానికి సరిపోతుందని చెప్పవచ్చు. ఇది స్థిరమైన, తేలికపాటి నూనె. చర్మంలోని సహజ లిపిడ్లను అనుకరిస్తుంది. చర్మం తేమను కోల్పోకుండా నీటి నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. జిడ్డు లేకుండా ఆయిల్ ఎక్కువగా భాగాలను సమతుల్యం చేస్తుంది. చర్మ సంరక్షణ నూనెలను మొదటిసారిగా ఉపయోగిస్తున్న వారికి ఇది సరైన ఎంపిక. సన్‌స్క్రీన్, మేకప్ కింద కూడా దీనిని సులభంగా ఉపయోగించవచ్చు. సీరమ్ లేదా క్రీమ్ రాసిన తరువాత 2 నుండి 3 చుక్కలు ఉదయం లేదా రాత్రి రాసుకోవాలి. వాతావరణాన్ని బట్టి నూనె పరిమాణాన్ని పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చేయాలి. జొజొబా ఆయిల్ ను కూడా చర్మ సంరక్షణకు ఉపయోగించవచ్చు. ఇది మానవ సెబమ్ కు దగ్గరగా ఉంటుంది. చర్మం నూనెను ఎక్కువగా ఉత్పత్తి చేయకుండా చేయడంలో, చర్మాన్ని మృదువుగా చేయడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. చర్మం అధికంగా నూనె ఉత్పత్తి చేసే వారు, మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నవారు దీనిని ఉపయోగించడం మంచిది. రాత్రి సమయంలో మాయిశ్చరైజర్ రాసిన తరువాత 1 నుండి 3 చుక్కల మోతాదులో రాసుకోవాలి.
ఇక రోజ్‌హిప్ ఆయిల్ ను వాడడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. దీనిలో చర్మ సంరక్షణకు అవసరమయ్యే ఫ్యాటీ యాసిడ్లతో పాటు విటమిన్స్ కూడా ఉంటాయి. చర్మ రంగును మెరుగుపరచడంలో, చర్మాన్ని మృదువుగా చేయడంలో ఈ నూనె దోహదపడుతుంది. చర్మంపై మచ్చలు ఎక్కువగా ఉండే వారు దీనిని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రాత్రి సమయంలో 2 నుండి 3 చుక్కల మోతాదులో మాయిశ్చరైజర్ పై రాసుకోవాలి. అయితే బలమైన రెటినాయిడ్స్ తో కలిపి దీనిని వాడకూడదు. విటమిన్ ఇ, అసంతృప్త కొవ్వులు సమృద్దిగా ఉండే ఆర్గాన్ నూనెను వాడడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. చర్మాన్ని మృదువుగా చేయడంలో, రక్షణ పొరను పునరుద్దరించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. ఇది మధ్యస్థ గాఢతతో ఉండే తైలం. పొడిబారిన చర్మం కలిగి ఉన్నవారు దీనిని వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. క్రీమ్ రాసిన తరువాత 2 నుండి 4 చుక్కల మోతాదులో దీనిని రాసుకోవచ్చు. పొడి వాతావరణంలో ఉదయం సన్‌స్క్రీన్ కింద కూడా దీనిని రాసుకోవచ్చు. ఆక్సీకరణ నిరోధక గుణాలు సమృద్దిగా ఉండే మరులా నూనెను వాడడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. దీనిని వాడడం వల్ల చర్మం పట్టేసినట్టు ఉండే భావన తగ్గుతుంది. పొడి, సున్నితమైన చర్మం ఉన్నవారు దీనిని ఉపయోగించడం మంచిది. రాత్రి సమయంలో 2 నుండి 3 చుక్కల మోతాదులో దీనిని ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఈ నూనెలను వాడడం వల్ల అందమైన, ఆరోగ్యవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.