చౌటుప్పల్, అక్టోబర్ 28 : రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. కొనుగోళ్లు కేంద్రాలు ప్రారంభించి రోజులు గడుస్తున్నా ధాన్యం తూకం వేయడంలో స్పీడ్ పెరుగడం లేదు. దాంతో కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ మార్కెట్లో ఇప్పటివరకు 119 మంది రైతులు ధాన్యం కుప్పలు పోశారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ కొనుగోళ్లు ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా.. కేవలం 8 మంది రైతుల కుప్పలు మాత్రమే తూకం వేశారు. ప్రతినిత్యం ఇద్దరు ముగ్గురు రైతులకన్నా ఎక్కువ ధాన్యం కొనడం లేదు.
చౌటుప్పల్ మండల వ్యాప్తంగా 17 వరిధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో ఇదే పరిస్థితి. ఈ ఆలస్యానికి ప్రధానంగా లారీల్లో ధాన్యం దిగుమతి కాకపోవడమే కారణమని అధికారులు అంటున్నారు. వాటి సమస్యతోనే ధాన్యం తూకం నెమ్మదిగా జరుగుతున్నదని చెప్తున్నారు. గతంలో స్థానిక మిల్లర్లు ధాన్యం సేకరించేది. ప్రస్తుతం వారికి కొంత డిపాజిట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మిల్లర్లు ధాన్యం సేకరించేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. దీంతో ధాన్యాన్ని సివిల్ సైప్లె గోదాములకు త రలిస్తున్నారు. అక్కడ జిల్లా నలుమూలల నుంచి లారీలు రావడంతో త్వరితగతిన ఖాళీ కాకపోవడంతో ఈ సమస్య మరింత పెరిగిం ది. ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.
నేను నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశా. చౌటుప్పల్ మార్కెట్ యార్డ్‌లోని కొనుగోలు కేంద్రానికి నెల రోజుల కిందట ధాన్యాన్ని తీసుకొచ్చిన. మిగతా వ్యవసాయ పనులు వదులుకొని రోజంతా ఇక్కడే ఉంటున్నా. దసరా పండుగ తర్వాత వానలకు కూడా వడ్లు తడిస్తే కూలీలను పెట్టి ఆరబెట్టిన. ఇందుకు 10వేల రూపాయల ఖర్చు వచ్చింది. ఇప్పటి కూడా రోజంతా ఆరబెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నా.
-ఏనుగు నర్సిరెడ్డి, రైతు, చౌటుప్పల్
వడ్లు తెచ్చి నెల దాటింది. ఇంకా మా లైన్ రాలేదు. కనీసం మాయిశ్చర్ కూడా చూడలేదు. రాత్రింబవళ్లు వడ్లకానే కావలి కాస్తున్నం. వాన భయంతో వడ్లు ఆరబోస్తున్నం. మబ్బులు వస్తే పరదాలు కప్పుతున్నం. ఇంతకుముందు వాన వచ్చి ధాన్యం తడిస్తే మిషన్లతో ఎండబోసి పడితే రూ. 20వేల వరకు ఖర్చు వచ్చింది. ఇకనైనా మా వడ్లు కొనాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నం.
-దుర్గం మల్లమ్మ, రైతు, చిన్నకొండూర్, చౌటుప్పల్