నీలగిరి, అక్టోబర్ 21 : సమాజాన్ని శాంతియుతంగా ఉంచడంలో పోలీసుల పాత్ర ఎనలేనిదని రాష్ట్ర, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించడానికి సైతం వెనుకాడని సైనికుడు పోలీస్ అని కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం, సమాజ సేవ కోసం అమరులైన పోలీసుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. పోలీస్ స్టేషన్ అంటే భయపట్టే కేంద్రం కాదని, బాధలు తీర్చే కేంద్రమని అన్నారు. జిల్లాలో 15 మంది పోలీసులు అమరులయ్యారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక్కో కుటుంబానికి 25 వేల ఆర్ధిక సాయం ప్రకటించారు.
కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల కుటుంబాలకు 10 వేల రుపాయల చొప్పున చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అదనపు ఎస్పీ రాములునాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, డీఎస్పీలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.