సూర్యాపేట టౌన్, నవంబర్ 18 : పోలీసులకు అనుమానం రాకుండా ఖరీదైన కార్లను ఉపయోగిస్తూ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా సూర్యాపేట జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. కారు వెనుకాల బంపర్ డూమ్ మధ్యలో ప్రత్యేకంగా జాలి ఏర్పాటు చేసి అందులో గంజాయి ప్యాకెట్లు పెట్టి తరలిస్తున్నారు. తనిఖీల్లో కార్లను సూర్యాపేట పట్టణ, కోదాడ రూరల్ పోలీసులు పట్టుకోగా విషయం బయటికి వచ్చింది. సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో కేసులకు సంబంధించిన వివరాలను ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ వెల్లడించారు. సూర్యాపేట టూ టౌన్ ఎస్ఐ గోపికృష్ణ తన సిబ్బందితో జాతీయ రహదారి ఎన్టీఆర్ పార్క్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా గుర్తు తెలియని రెండు కార్లు అనుమానాస్పదంగా ఒకదాని వెంట ఒకటి పట్టణంలోకి రావడాన్ని గమనించారు.
ఆపి తనిఖీ చేస్తుండగా కారులోని నిందితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బచ్చల మోహనకృష్ణ, కోరా అచ్యుత్రాజు, షేక్ ఖాసీం, హుక్కావాయి విజయ్, బొమ్మగాని శ్రీకాంత్‌గౌడ్ పారిపోయేందుకు ప్రయత్నించడంతో వారిని పట్టుకొని విచారించారు. షేక్ ఖాసీంకు పరిచయమున్న కర్నాటకకు చెందిన హుక్కావాయి విజయ్, అతని కుమారుడు శుభం కర్నాటకలోని బీదర్ ప్రాంతంలో గంజాయి అమ్ముతూ ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ అప్పుడప్పుడు మహారాష్ట్రకు కూడా వెళ్లి విక్రయిస్తుంటారు. అప్పుడప్పుడు ఖాసీంతో పాటు ఒడిశాకు వెళ్లేవారు. ఈ నెల 16న షేక్ ఖాసీంతో పాటు హుక్కావాయి విజయ్, శుభం కార్లకు డ్రైవర్లుగా బొమ్మగాని శ్రీకాంత్‌గౌడ్, షేక్ మౌలాలు ఉండి అందరూ ఖాసీంకు చెందిన రెండు కార్లలో ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా చింట్రకొండ ప్రాంతానికి వెళ్లారు.
అక్కడ బాచెలి మోహన్‌కృష్ణ, కోర అచ్యుతరాజు వద్ద 72కిలోల గంజాయిని కిలో రూ.2,500 చొప్పున కొనుగోలు చేసుకొని కారు వెనుకవైపు డిక్కి కింద పెట్టి సాయంత్రం అక్కడ నుంచి బయల్దేరారు. కర్నాటకలోని బీదర్ ప్రాంతానికి వెళ్లడానికి విజయవాడ, సూర్యాపేట, హైదరాబాద్ మీదుగా వెళ్తుండగా సూర్యాపేట వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి ప్యాక్ చేసిన గంజాయి ప్యాకెట్లు ఒక కారులో 9, మరో కారులో 9 మొత్తం 75కిలోల 17గంజాయి ప్యాకెట్లు, 8సెల్ ఫోన్స్, 2 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మరో కేసులో నిందితుడు మహారాష్ట్రకు చెందిన నిందితుడు మీరగానే ప్రభాకర్ రోడ్ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తూ గంజాయికి బానిసై గంజాయి వ్యాపారం చేసేందుకు నిర్ణయించుకున్నాడు. ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా చుట్టు పక్కల ప్రాంతాల్లో తనకు తెలిసిన వారి కారు తీసుకొని ఒడిశాలోని సీలేరులో ఓసారి గంజాయి కొనుగోలు చేసి భద్రాచలం మీదుగా పట్టుకెళ్లి కొంత డబ్బు సంపాదించాడు. తరువాత ఎక్కువ మొత్తంలో గంజాయిని పట్టుకెళ్లాలనుకొని అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు.
అక్కడ జైలులో పలువురి నుంచి గంజాయి రవాణా విషయం తెలుసుకొన్నాడు. బయటికి వచ్చిన తర్వాత ఈ నెల 16న గంజాయి తీసుకొని పలాస నుంచి విశాఖపట్నం, విజయవాడ మీదుగా కారులో వస్తుండగా ఈ నెల 17న సాయంత్రం కోదాడ దగ్గరలోని చిమిర్యాల క్రాస్ రోడ్ వద్ద కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. రూ. 9.25లక్షల విలువైన 37.460 కిలోల గంజాయి, కారు, మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. నిందితులను పట్టుకోవడంలో బాగా పని చేసిన డీఎస్పీ రవి, మట్టయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి, సూర్యాపేట సీఐ రాజశేఖర్, ఎస్ఐలు శ్రీకాంత్, కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్‌రెడ్డి, సూర్యాపేట టౌన్ ఎస్ఐ గోపికృష్ణ, ఎస్ఐ నవీన్, సీసీఎస్ సిబ్బంది, సూర్యాపేట పట్టణ, కోదాడ రూరల్ సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డ్సు అందజేశారు.