Hyderabad High Way | సంక్రాంతి సంబురం ఇవాల్టితో ముగుస్తుంది. ఇక ఏపీలోని సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు మళ్లీ పట్నం బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ – విజయవాడ హైవేపై రద్దీని తగ్గించేందుకు నల్గొండ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటతంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులకు సహకరించాలని కోరారు.
1) గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు :
గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి – మాల్ మీదుగా హైదరాబాద్.
2) మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు :
మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండపల్లేపల్లి – చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్.
3) నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు :
నల్లగొండ – మార్రిగూడ బై పాస్ -మునుగోడు → నారాయణపూర్- చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65)మీదుగా హైదరాబాద్.
4.) విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు..
కోదాడ-హుజూర్నగర్-మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్.
5). ఎన్. హెచ్ 65 (విజయవాడ -హైదరాబాద్ )రహదారి పై చిట్యాల,పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుంచి భువనగిరి గుండా హైద్రాబాద్ మళ్లించడం జరుగుతుంది.
ఈ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ, హైద్రాబాద్ పై (ఎన్. హెచ్ 65 )ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని పోలీసులు తెలిపారు.