యాదాద్రి భువనగిరి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ)/ భువనగిరి కలెక్టరేట్: జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా దంచికొట్టింది. భువనగిరి పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూదాన్‌పోచంపల్లి నుంచి బీబీనగర్ వెళ్లే మార్గంలో రుద్రవెల్లి దగ్గర మూసీ నది పొంగిపొర్లుతున్నది. దాంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఆ మార్గం మీదుగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వలిగొండ మండలం సంగెం గ్రామ పరిధిలోని భీమలింగం కత్వా లోలెవల్ వంతెనపై నుంచి మూసీ ప్రవహిస్తుండడంతో సంగెం-బొల్లేపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భూదాన్‌పోచంపల్లి నుంచి పెద్దరాలపల్లి మీదుగా బీబీనగర్‌కు వెళ్తున్నారు. భారీ వర్షంతో గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు రోడ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అత్యధికంగా యాదగిరిగుట్టలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భువనగిరిలో 13.2, బొమ్మలరామారంలో 9.9, మోటకొండూరులో 9.5, ఆలేరులో 6.8, నారాయణపురంలో 6.8, ఆలేరులో 6.8, తుర్కపల్లిలో 5.6, రాజాపేటలో 3.9, చౌటుప్పల్‌లో 3.3, ఆత్మకూరు(ఎం)లో 3.2, భూదాన్‌పోచంపల్లి 2.3, బీబీనగర్‌లో 1.9, గుండాలలో 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.