నల్లగొండ ప్రతినిధి, జూన్2(నమస్తే తెలంగాణ) : రాజకీయంగా తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు మూహూర్తం దగ్గరపడింది. మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ లోక్‌సభ స్థానం లెక్కింపు నల్లగొండలో, భువనగిరి స్థానం లెక్కింపు భువనగిరిలోనే వేర్వేరుగా జరుగనున్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో షురూ చేసి తర్వాత ఈవీఎంల కౌంటింగ్ మొదలుపెడతారు. ఒక్కో హాల్లో అసెంబ్లీ నియోజకవర్గం వారీగానే లెక్కింపు చేస్తూనే.. అన్ని కలిపి ఒక్కో రౌండ్ వారీగా ఫలితాలు వెల్లడిస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా లెక్కింపు రౌండ్ల సంఖ్య ఉంటుంది.
ఉదయం 11 గంటల వరకు ఫలితాల సరళి వెల్లడి కానుండగా అధికారిక తుది ఫలితం మాత్రం సాయంత్రానికే వెలువడనుంది. నల్లగొండ లోక్‌సభ స్థానంలో బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి సహా మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. భువనగిరి స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా క్యామ మల్లేశ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్యగౌడ్, సీపీఎం నుంచి ఎండీ జహంగీర్ సహా మొత్తం 39 మంది పోటీ పడ్డారు.
ఈ నెల 13న పోలింగ్ జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు ఉండగా.. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్, దేవరకొండ, నాగార్జున సాగర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. భువనగిరి ఎంపీ స్థానం పరిధిలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్, ఇబ్రహీంపట్నం, జనగాం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నల్లగొండ పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపు నల్లగొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డులో దుప్పలపల్లి సమీపంలో ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో జరుగనుంది. భువనగిరి పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపు పట్టణం సమీపంలోని అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో చేపట్టనున్నారు.
నల్లగొండ పార్లమెంట్ పరిధిలో మొత్తం 17,25,465 ఓటర్లు ఉండగా 74.02శాతం పోలింగ్‌తో 12,77,137 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న 18,08,585 మంది ఓటర్లలో 76.78 శాతం ఓటింగ్‌తో 13,88,680 మంది ఓటు వేశారు. నల్లగొండలో మిర్యాలగూడ రోడ్డులోని అనిశెట్టి దుప్పలపల్లి సమీప గోదాముల్లో.. భువనగిరిలో అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సర్వం సిద్ధం చేశారు. పటిష్టమైన బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు జరుగనుండగా… ఎన్నికల కమిషన్ అనుమతితో జారీ అయిన పాస్‌లు ఉన్న అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లను మాత్రమే లోనికి అనుమతించనున్నారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో మూడెంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
రేపు ఉదయం 6 గంటలకు స్ట్రాంగ్రూమ్స్ను అభ్యర్థులు లేదా వారి ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో సీల్ తొలిగిస్తారు. తర్వాత ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్లను ఆర్ఓ టేబుల్ వద్ద లెక్కింపు ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ మొదలైన తర్వాత 8.30గంటల ప్రాంతంలో ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపును షురూ చేస్తారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం ఓట్లను ఒక్కో హాల్లో లెక్కిస్తూ ఇలా మొత్తం ఏడు హాల్స్‌లో ఒకేసారి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఒక్కో కౌంటింగ్ హాల్లో 14 లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేసి 14ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు.
ఇలా ఒకేసారి 98 ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ఒక రౌండ్లో పూర్తి కానుంది. ఇలా అన్ని హాల్స్‌లోని వివరాలను ఒకచోట జత చేసి ఒక్కో రౌండ్ వారీగా ఓట్ల లెక్కింపును వెల్లడిస్తారు. ఇలా గంటలకు 2 నుంచి 3 రౌండ్ల పలితాలు వెల్లడికావచ్చని అంచనా. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితాల సరళి స్పష్టం కావచ్చు. తుది ఫలితాలు వెల్లడయ్యే సరికి సాయంత్రం 4గంటల దాటవచ్చని తెలుస్తుంది. ఇక ఎన్నికల కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి మూడు దఫాలుగా శిక్షణ పూర్తి చేశారు. వీరికి ర్యాండం పద్ధతిలో శనివారం విధులను కేటాయించారు. వీరంతా ఉదయం 6 గంటల వరకే విధుల్లో ఉండాల్సిందిగా ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రంలోనే అల్పాహారం, భోజనం, టీ, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.