సాగుకు బలమైన కార్తెల్లో ఒకటిగా భావించే రోహిణి ప్రవేశంతో వానకాలం సీజన్ మొదలవుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు దన్నుగా అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నది. పంటల సాగు, విత్తనాలు, ఎరువులు, నకిలీల కట్టడికి ప్రత్యేక నిఘా.. తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ రూపొందించిన పంటల ప్రణాళికకు బుధవారం తుదిరూపం ఇవ్వనున్నది. ఈ సీజన్ పంటల సాగుకు సంబంధించి సమగ్రంగా చర్చించేందుకు నేడు జిల్లాల వారీగా ‘వానకాలం అవగాహన సదస్సు-2022’కు ఏర్పాట్లు చేసింది. ఉదయం నల్లగొండ జిల్లా కేంద్రంలో నల్లగొండ, యాదాద్రి జిల్లాలు, మధ్యాహ్నం సూర్యాపేటలో ఆ జిల్లాకు సంబంధించిన సదస్సు జరుగనున్నది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరుకానున్నారు. మూడు జిల్లాల ప్రజాప్రతినిధులతోపాటు వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, రైతుబంధు సమితి అధ్యక్షులు పాల్గొననున్నారు.
స్వరాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం వానకాలంలో రైతులకు అన్నిరకాలుగా అండగా ఉండేందుకు సిద్ధమవుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సరైన వర్షాలు కురిస్తే అదును మీద విత్తనాలు వేసేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగు అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రాథమికంగా పంటల వారీగా సాగు అంచనాలు రూపొందించి అధికారులు రంగంలోకి దిగారు. విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడంపై దృష్టి సారించారు. మరోవైపు గత నెల ప్రారంభం నుంచే నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వ్యవసాయ, పోలీసుశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

ఇతర పంటల వైపు ప్రోత్సాహం..
వానకాలం సీజన్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10.75లక్షల ఎకరాల్లో వరి, 10.13లక్షల ఎకరాల్లో పత్తి పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అంచనాలు రూపొందించింది. ఇదే సమయంలో సంప్రదాయ పంటల నుంచి ప్రత్యామ్నాయం వైపు రైతులను మరల్చేందుకు గత సీజన్ నుంచి ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టారు. వీటిపైన అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పత్తి లాభదాయకంగా మారడం తో రైతులను అటువైపుగా ప్రోత్సహించాలని భావిస్తున్నారు. వరి కాకుండా నీటి ఆధారితంగా సాగయ్యే ఇతర పంటలను ప్రోత్సహించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే పామాయిల్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.
సదస్సుల షెడ్యూల్ ఇలా…
నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్‌లో నల్లగొండ, యాదాద్రి జిల్లాలకు కలిపి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న సదస్సుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరుకానున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం 2.30 గంటలకు సూర్యాపేటలోని బాలాజీ గార్డెన్స్‌లో జరిగే అవగాహన సదస్సులో మంత్రులు పాల్గొననున్నారు. ఈ సదస్సులకు జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి వరకు వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతుబంధు సమితి అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, ఆదర్శ రైతులు పాల్గొనున్నారు.
22 లక్షల ఎకరాల్లో సాగు
అధికారుల లెక్కల ప్రకారం వానకాలంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 22లక్షల ఎకరాల పైచిలుకు సాగు కానున్నాయి. ఈ సీజన్‌కు సంబంధించి ఉమ్మడి జిల్లాకు మొత్తం 2.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 1.60 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 70,504 మెట్రిక్ టన్నుల డీఏపీతో పాటు 46,230 మెట్రిక్ టన్నుల ఎంఓపీ, 23,986 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ ఎరువులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. పంటల అవసరాలకు అనుగుణంగా వీటిని అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ అంశాలపై నేడు జిల్లాల వారీగా జరిగే వానకాలం అవగాహన సదస్సు-2022లో సమగ్రంగా చర్చించి తుదిరూపం ఇవ్వనున్నారు.