కారేపల్లి, ఫిబ్రవరి 23 : సీతారామ ప్రాజెక్ట్ కాల్వ కింద భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులకు అందులో పండించిన పంట దిగుబడి తీసుకునే అవకాశాన్ని కల్పించాలని చీమలపాడు బాజీ మల్లయ్యగూడెం రెవెన్యూ గ్రామాలకు చెందిన రైతులు అధికారులను కోరారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు కింద ఈ ప్రాంతంలో 168 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుండి సేకరించిందన్నారు. రైతులకు పరిహారం చెల్లించిన అధికారులు అందులో ఉన్న పంటను కూడా రైతులే దిగుమతి చేసుకునే విధంగా వీలు కల్పించాలని అధికారులను వేడుకున్నారు. ఈ విషయమై ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి జిల్లా కలెక్టర్కు చెప్పిచ్చినట్లు పేర్కొన్నారు. రైతులను పంట దిగుమతి చేసుకోకుండా స్థానిక అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో రైతులు బచ్చలి వెంకటేశ్వర్లు, గుజ్జర్లపూడి సైదులు, పాటి రమేష్, పాటి రాంబాబు, పాటి రామయ్య, షేర్ వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, సైదులు, షేర్ మల్లయ్య పాల్గొన్నారు.