రాంచీ, ఆగస్టు 14 : జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసన శుక్రవారం నాటికి 21వ రోజుకు చేరుకుంది. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం(ఆగస్టు 15) తిరంగా యాత్రను నిర్వహించాలని నిరసనకారులు యోచిస్తున్నారు. ఆగస్టు 10న రాష్ట్ర అసెంబ్లీ వైపుగా జరిగిన ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసపై విద్యార్థుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాంచీ జిల్లా యంత్రాంగంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు జరిగే తిరంగా యాత్ర తమ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తుందని వారు ప్రకటించారు. జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్ ఆధ్వర్యంలో నిరసనకారులు నియామక పరీక్షల్లో మరింత పారదర్శకతను పాటించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆగస్టు 10 నాడు విద్యార్థులు చేపట్టిన చలో అసెంబ్లీ సందర్భంగా హింసకు పాల్పడిన దుండగులను గుర్తించేందుకు పోలీసులు వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ర్యాలీలో నిరసనకారులు భద్రతా సిబ్బందితో ఘర్షణ పడిన ఘటనకు సంబంధించి 300 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విధానసభ పోలీసు స్టేషన్లో నమోదైన ఈ కేసు నిషేధాజ్ఞల ఉల్లంఘన, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడులకు సంబంధించినదని రాంచీ ఎస్పీ పారస్ రాణా తెలిపారు. ఇలా ఉండగా 13 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా(జేఎల్కేఎం) నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతున్నది. అసెంబ్లీ మార్చ్‌లో పాల్గొన్న అనంతరం ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం సదర్ దవాఖానలో చేరారు. బుధవారం నిరసన ప్రదేశానికి తిరిగి వెళ్లేందుకు ఆయన రాంచీ సివిల్ సర్జన్ నుంచి అనుమతి కోరారు.