SRK, Ajay Devgn | మహారాష్ట్రలో నిషేధించబడిన పాన్ మసాలా బ్రాండ్‌ను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) జారీ చేసిన నోటీసులకు బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ స్పందించారు. విమల్ ఇలాచీ ప్రకటనకు సంబంధించి ఎఫ్‌డీఏ పంపిన నోటీసులపై ముగ్గురు నటులు తమ సమాధానాలను అందజేసినట్లు సమాచారం. వీరిలో ఇద్దరు నటులు వ్యక్తిగత విచారణను కోరగా, ఆ విచారణ ప్రక్రియ పూర్తయిందని ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే తాజాగా వెల్లడించారు. నిషేధిత పాన్ మసాలా ఉత్పత్తులకు ఎలాచీ పేరుతో సర్రోగేట్ యాడ్స్ (పరోక్ష ప్రకటనలు) ఇస్తున్నారన్న ప్రధాన ఆరోపణలపై ఎఫ్‌డీఏ చట్టపరమైన చర్యలను మరింత ముమ్మరం చేసింది.
ఈ ప్రకటనల ప్రచారంలో పాల్గొన్నందుకు గాను ఎఫ్‌డీఏ గతంలో ఈ ముగ్గురు నటులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంట్రాక్టులు, రెమ్యునరేషన్ వివరాలు, క్యాంపెయిన్ వంటి పత్రాలను సమర్పించాలని, తప్పుదారి పట్టించే ఆహార ప్రకటనల చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. తప్పుదారి పట్టించే ప్రకటనలను ప్రమోట్ చేసే సెలబ్రిటీలు కేవలం తయారీదారులపై నెపం నెట్టి బాధ్యత నుండి తప్పించుకోలేరని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. ఈ ప్రకటనలకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని కూడా ఆదేశించింది. మహారాష్ట్రలో గుట్కా, పాన్ మసాలా తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై కఠినమైన నిషేధం ఉన్నందున, ఈ నిబంధనల ఉల్లంఘనపై ఎఫ్‌డీఏ కఠినంగా వ్యవహరిస్తోంది. విచారణ పూర్తయిన నేపథ్యంలో ఎఫ్‌డీఏ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.