న్యూఢిల్లీ : దేశంలో తొలిసారిగా జనాభా లెక్కలతోపాటే ఆయా కులాలకు చెందిన వారి వివరాలను కూడా సేకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ నోటిఫికేషన్ జారీచేసింది. జనగణన-2027 సందర్భంగా ఇంటింటికీ వచ్చే ప్రభుత్వ సిబ్బంది అడగాల్సిన 40 ప్రశ్నలను నోటిఫై చేసింది. ఇందులో ఇతర వివరాలతోపాటు ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారి వివరాలతోపాటు ఇతర కులాలకు చెందిన వారి వివరాలను కూడా సేకరించాలని సూచించింది. ఈ ప్రక్రియ తొలుత మంచు కురిసే ప్రాంతాలలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నదని రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ కుమార్ నారాయణ్ తన ఉత్తర్వుల్లో వెల్లడించారు. ప్రజల వద్దకు వెళ్లే గణన అధికారులు వారు తెలియజేసే కులాన్ని నమోదు చేస్తారు. గత నెలలో 16 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దీనికి సంబంధించిన రిహార్సల్స్ నిర్వహించారు.
ఆధార్ నంబర్లు, మొబైల్ నంబర్లు, ఓటర్ ఐడీలు, బ్యాంక్ ఖాతాలు, కొవిడ్-19 టీకాల వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లఢక్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని మంచు ఎక్కువగా కురిసే, సాధారణ ప్రయాణానికి వీలుకాని ప్రాంతాల్లో తొలుత జనాభా గణన జరుగుతుంది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో వచ్చే ఏడాది జనగణన ప్రారంభం కానుంది. ఈ ప్రశ్నావళిలో కులాల జాబితా ఉండే అవకాశం లేదని, ప్రజలు ఏమి చెప్తే దానినే నమోదు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. జనాభాగణన అధికారులు ప్రజలను వైవాహిక స్థితి, వివాహ సమయానికి వారి వయస్సు, జీవిత భాగస్వామి పేరు, జాతీయత, మతం, కులం, తల్లిదండ్రుల వివరాలు, వైకల్యం, మాతృభాష, తెలిసిన ఇతర భాషలు, అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత తదితర వ్యక్తిగత వివరాలు అడగనున్నారు. అలాగే విద్యాసంస్థకు హాజరు కావడం, అత్యున్నత విద్యాస్థాయి, చదివిన కోర్సు, ఆర్థిక కార్యకలాపాల వర్గం, వృత్తి, పరిశ్రమ, వ్యాపారం, మొదలైన వివరాలు కూడా సేకరించానున్నారు.

ఇదేవిధంగా పుట్టిన ప్రదేశం, చివరి నివాస స్థలం, వలస వెళ్లడానికి కారణం, చివరి వలస నుంచి ఈ పట్టణంలో ఉండటానికి గల కారణం, ఇక్కడ ఉంటున్న కాలపరిమితి, శాశ్వత నివాసం, చిరునామా వివరాలను అడగనున్నారు. వివాహితులు, వితంతువులు, విడాకులు తీసుకున్న, లేదా విడిపోయిన మహిళను ప్రస్తుతం వారికున్న పిల్లల సంఖ్య, ప్రస్తుత వివాహంలో కలిగిన పిల్లల సంఖ్య తదితర వివరాలు నమోదు చేయనున్నారు. కొవిడ్-19 టీకా వేయించుకున్న ప్రదేశం, మొత్తం బ్యాంక్ ఖాతాల సంఖ్య, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఓటర్ ఐడీ నంబర్, పాస్‌పోర్ట్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగివున్నారా? తదితర వివరాలను అడగున్నారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా మొదటి దశ అయిన ఇండ్ల జాబితా, గృహగణన సెప్టెంబర్ 30 వరకూ కొనసాగనుంది. పలు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ 16న గృహ జాబితా, గృహ గణన కోసం క్షేత్ర స్థాయి సందర్శనలు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి 2021లో జరగాల్సిన ఈ శతాబ్దపు జనగణన ప్రక్రియ కొవిడ్-19 కారణంగా వాయిదా పడింది. కాగా జన గణన నిర్వహణకు కేంద్ర క్యాబినెట్ రూ. 11,718 కోట్లను ఆమోదించింది.