కట్టంగూర్, ఆగస్టు 23 : కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యంతోనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్ లో ఎరువుల దుకాణాలతో పాటు పీఏసీఎస్ కేంద్రాన్ని సందర్శించి స్టాక్ వివరాలను సీఈఓ మల్లారెడ్డిని అడిగి తెలుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా రైతులకు సకాలంలో యూరియా అందజేశారన్నారు. రాష్ట్రం అడిగిన 9.80 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే అందజేయడం జరిగిందన్నారు. మళ్లీ ఇప్పుడు అదనంగా పంపించడం జరుగుతుందన్నారు. 1.70 లక్షల టన్నుల యూరియా ఇప్పటికీ లెక్క దొరకడం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు కృత్రిమ కొరత సృష్టించి వ్యవసాయేతర రంగాలకు దొడ్డిదారిన అమ్ముకున్నారని ఆరోపించారు.
దేశంలో ఎక్కడా యూరియా కొరత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతోనే రాష్ట్రంలో సమస్య తలెత్తిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషితో రాష్ట్రానికి ఎక్కువ యూరియా వచ్చిందన్నారు. గత పది సంవత్సరాల్లో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. గత యాసంగిలో మిగిలిన స్టాక్ ఎక్కడుందో చెప్పాలని, అలాగే వచ్చిన యూరియాను ఎంత పంపిణీ చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య, కిసాన్ మోర్చారాష్ట్ర నాయకుడు భవనం మధుసూధన్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు నాగరాజు, జిల్లా నాయకులు పాదూరి వెంకట్ రెడ్డి, గున్నాల నాగరాజు ఉన్నారు.