కట్టంగూర్, డిసెంబర్ 10 : నల్లగొండ జిల్లాలో గురువారం జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్సీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బుధవారం కట్టంగూర్ ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్నికల సామగ్రి పంపిణీని ఆయన పరిశీలించి పోలీసు అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అక్రమాలు చోటుచేసుకోకుండా ప్రతి పోలీస్ సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి, నల్లగొండ సీఐ రాజశేఖర్ రెడ్డి, కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Kattangur : పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ శరత్ చంద్ర పవార్