సూర్యాపేట, మే 22 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో రైతులకు అవస్థలు తప్పడం లేదు. పండించిన పంటలను అమ్ముకుందామన్నా వారాల తరబడి కొనే దిక్కు లేకపోవడంతో ప్రైవేటులో తక్కువ ధరకు అప్పజెప్తున్న దుస్థితి నెలకొంది. గత బీఆర్ఎస్ హయాంలో రైతులు పండించిన పంటను వందకు వంద శాతం కొనుగోలు చేసి రోజల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొనుగోళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. సూర్యాపేట జిల్లాలో ఒక్క యాసంగి సీజన్‌ను పరిశీలిస్తే చాలు ఈ విషయం తేటతెల్లం అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి యాసంగి అయిన 2022-23లో జిల్లా వ్యాప్తంగా 3,61,445 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. తదనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు యాసంగిల్లో మొదటి సీజన్లో 1.20 లక్షల మెట్రిక్ టన్నులు తక్కువ కొనుగోలు చేయగా, ఈ సీజన్లో 60వేల మెట్రిక్ టన్నులు తక్కువ సేకరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం ప్రభుత్వానికి రైతులంటే ప్రాధాన్యం లేకపోవడం వల్లే ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన కొనసాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు వరుస ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా రైతాంగం పరిస్థితి దయనీయంగా ఉండగా, గత కేసీఆర్ సర్కారు సాగు నీరు, నిరంతర ఉచిత విద్యుత్, రైతు బంధు, చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోళ్లతో సాగును సస్యశ్యామలం చేశారు. దాంతో అన్నదాతలు ఆర్ధికంగా కొంత నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట చేతికి వచ్చే సమయానికే ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన చివరి గింజ వరకూ కొనుగోలు చేసేది. కానీ, ప్రస్తుతం రైతులు అష్టకష్టాలు పడి పండించిన పంటను అమ్ముకునేందుకు దిక్కూ దిశ లేకుండా పోతున్నది. ఈ యాసంగిలో దాదాపు 70 శాతం వరి కోతలు పూర్తయిన తరువాత కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. లారీల కొరత, ఐకేపీ కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యం దిగమతికి కొర్రీలతో చాలాచోట్ల ఐకేపీ కేంద్రాలకు వచ్చిన ధాన్యం నెలకు పైగా కాంటాలకు నోచక అలాగి ఉండిపోయింది. ఎండ, వానకు రైతుల నిరీక్షణ తప్పలేదు.
సర్కారు నిర్లక్ష్యమో, శాఖల మధ్య సమన్వయ లోపమో గానీ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు తగ్గుతూ వస్తున్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 2022-23 యాసంగిలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సూర్యాపేట జిల్లాలో 3,61,445 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. తదనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి యాసంగి 2023-24లో 2,40,578 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే 1,20,867 లక్షల మెట్రిక్ టన్నులు తక్కువ. ప్రస్తుత యాసంగిలో ఇప్పటి వరకు 2,84,356 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. మరో 20వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన 2023-24తో పోల్చితే 60వేల మెట్రిక్ టన్నులు తక్కువ కొనుగోలు చేసినట్లే. కొనుగోళ్లలో నిర్లక్ష్యం, జాప్యం కారణంగా విసుగెత్తుతున్న రైతులు నిత్యం ఏదోక చోట ఆందోళనకు దిగుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్‌లో తక్కువ ధరలకు దళారులు, వ్యాపారులకు తెగనమ్ముకుంటూ ఆర్ధికంగా నష్టపోతున్నారు. తుం గతుర్తి మండలంలోని అన్నారం గ్రామం లోని ఐకేపీ కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు అవుతున్నా కాంటా వేయక పోవడంతో విసుగెత్తిన రైతు ఉప్పల వెంక న్న బుధవారం కొనుగోలు కేంద్రంలోనే ఆత్మహత్యాయత్నం చేశారు. పక్కనున్న రైతులు గమనించి పెట్రోల్ బాటిల్ లాక్కోవడంతో ప్రమాదం తప్పింది.