సూర్యాపేట, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 7 మండలాల్లో జరిగిన పంచాయతీ పోరులో మొత్తం 146 సర్పంచ్ పదవులు, 1318 వార్డు పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 22 పంచాయతీలు, 124 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 124 సర్పంచ్లు, 1061 వార్డులకు పోలింగ్ జరిగింది. ఏడు మండలాల్లో మొత్తం 1,92,617 మంది ఓటర్లకు గాను 1,71,903 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో పోలింగ్ శాతం 89.25గా నమోదైంది..అత్యధికంగా చింతలపాలెం, అత్యల్పంగా మేళ్లచెరువులో నమోదైంది.

ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రతి రెండు గంటలకు పెరుగుతూ వచ్చింది. ఉదయం తొమ్మిది గంటలకు 24.83 శాతం నమోదు కాగా 11 గంటలకు 60.13, మధ్యాహ్నం ఒంటిగంటలకు 86.19 శాతం నమోదు కాగా అప్పటికే పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి ఓటేసే అవకాశం కల్పించడంతో చివరకు 89.25 శాతంగా నమోదైంది. తొలి, రెండో విడతతో పోల్చుకుంటే మూడో విడత పోలింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. తొలి విడతలో 89.69 శాతం నమోదు కాగా రెండో విడతలో 89.55 శాతం, మూడో విడత 89.25 శాతంగా నమోదైంది. పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతో పాటు ఇతర అధికారులు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పర్యటించారు.
