నకిరేకల్, మే 08 : సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గుండాయిజానికి ప్రతీకలు అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ దాడులకు, గూండాయిజానికి భయపడేది లేదన్నారు. బండి సంజయ్ తన హోదా, బాధ్యతలను మరిచి బీజేపీ గూండాలను ఉసిగొల్పి కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కరీంనగర్లో ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ప్రజా ప్రతినిధుల కార్యాలయాలకే భద్రత లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని అన్నారు. బండి సంజయ్ నోటినుండి ప్రజలకు ఉపయోగపడే ఒక్క మాట కూడా వినలేదన్నారు. ప్రతి రోజు కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శించడం తప్ప ఆయన ఇంకేం చేశాడన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఎలా దాడులు చేయిస్తున్నారో, అదే తరహాలో తెలంగాణలో కూడా ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ కనుసన్నల్లో బీజేపీ నాయకులు ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.