నకిరేకల్, నవంబర్ 21: ‘ఫార్ములా ఈకార్ రేసుతో తెలంగాణ రాష్ర్టానికి వందల కోట్ల రూపాయల ఆదాయం, పెట్టుబడులు వచ్చాయి. ఈకార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ అనుమతించడం వెనుక భారీ కుట్ర జరిగింది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే సీఎం రేవంత్‌రెడ్డి కేటీఆర్‌పై అక్రమ కేసు గుర్తుకు వచ్చింది.
ఇలాంటి కేసులు బీఆర్ఎస్కు, కేసీఆర్‌కు, కేటీఆర్‌కు కొత్తేమీ కాదు’ అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని సువర్ణగార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై రాష్ట్రంలో బీఆర్ఎస్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అడిగితే గవర్నర్ అనుమతించడం కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు ఓట్లు ఏ మాత్రం తగ్గకపోవడంతో రేవంత్‌రెడ్డికి నిద్రపట్టడం లేదన్నారు. నిత్యం బడే బాయ్ అని మోదీ జపం చేస్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్‌కు కేంద్రం వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్ లేదని తెలిసీ బీఆర్ఎస్పై కుట్ర చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్‌తో చేతులు కలిపి కేటీఆర్‌పై కుట్రలు చేయడం బీజేపీకి తగదన్నారు. ఫార్ములా ఈకార్ రేసు కేసులో ఏమీ లేదని అందరికీ తెలుసన్నారు. ఫార్ములా ఈకార్ రేసుతో రాష్ర్టానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఉద్యమం నాటి నుంచే ఎన్నో కేసులు, నిర్బంధాలను ఎదుర్కొని రాష్ర్టాన్ని సాధించి.. సీఎం కేసీఆర్ పదేండ్లు పాలించి తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. రెండేళ్ల పాలనలోనే రాష్ట్రం అదోగతి పాలైందని విమర్శించారు.
చేసిందేమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ రాక ప్రజల దృష్టిని మళ్లీంచేందుకు బీఆర్ఎస్పై కేసుల కుట్ర పన్నుతున్నారన్నారు. ఎన్ని కేసులు వేసినా, ఎన్ని నిర్బంధాలు విధించినా అంతే వేగంగా బీఆర్ఎస్ జనంలోకి దూసుకెళ్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు. కేటీఆర్‌పై ఈ ఫార్ములా పేరుతో విచారణను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
తక్షణమే అక్రమ కేసులను ఉపసంహరించుకుని ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని, లేదంటే ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ‘ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాంటి కేసుల అంశాన్ని తెరపైకి తెచ్చి రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని అన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకుని ప్రజాపాలనపై దృష్టి పెట్టాలని హితువు పలికారు.
సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ తరాల బలరాం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, మాజీ ఎంపీటీసీలు రాచకొండ వెంకన్న, గుర్రం గణేశ్, నాయకులు పెండెం సదానందం, రావిరాల మల్లయ్య, యానాల లింగారెడ్డి, కొండ వినయ్, చిట్యాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.