జిల్లాలో కరెంట్ కష్టాలు షురూ అయ్యాయి. అటు అనధికారికంగా కోతలు.. ఇటు వర్షాలు, గాలి దుమారంతో విద్యుత్ సరఫరా లేక జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అసలే ఎండాకాలం కావడంతో విలవిల్లాడుతున్నారు. కరెంట్ ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా భువనగిరిలో కరెంట్ కోసం రోడ్డెక్కి ఆందోళన చేపట్టడమే ఇందుకు నిదర్శనం.
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లాలో 4.30 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందులో 2.70లక్షల గృహ వినియోగం కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం 200ఎంయూ(మిలియన్ యూనిట్ల) విద్యుత్ డిమాండ్ ఉన్నది. వేసవి కావడంతో కరెంట్ భారీగా వినియోగిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో విద్యుత్ కోతలతో జనం అల్లాడిపోతున్నారు. ప్రతి రోజూ 5నుంచి 7సార్లు కరెంట్ కట్ చేస్తున్నారు. ప్రతి సారి 15నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు సరఫరా నిలిచిపోతున్నది. ఈ లెక్కన రోజుకు సుమారుగా 2నుంచి 5 గంటల పాటు కరెంట్ ఉండటం లేదు. వేసవి కావడంతో ఇంట్లో ఉండలేక, బయటికి రాలేక సతమతమవుతున్నారు. ఇంట్లో శుభకార్యం ఉందంటే చాలు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు కరెంట్ కోత కారణంగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిన్నారులు, వృద్ధుల పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. మధ్యాహ్న సమయంలో పవర్ కట్ చేస్తుండటంతో కొందరు చెట్ల కింద సేద తీరుతున్నారు. రాత్రి పూట కరెంట్ కోతతో నిద్ర కరువవుతున్నది. విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేస్తే తప్ప పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కరెంట్ కోతలు అటుంచితే చిన్నపాటి వర్షం పడినా, గాలి వీచినా విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నది. గంటల తరబడి కరెంట్ రావడం లేదు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా కట్ చేస్తున్నారు. గత నెల రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. కరెంట్ సరఫరాలో తరచూ అంతరాయంతో వ్యాపార, వాణిజ్య వర్గాలపై ఎక్కువగా ప్రభావం పడుతున్నది. అంతరాయానికి నెలకొరిగిన స్తంభాల పునరుద్ధరణ, చెట్ల కొమ్మలు తొలగింపు కారణంగా విద్యుత్ నిలిపివేస్తున్నామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయమే కాకుండా కొన్ని సార్లు హెచ్చు తగ్గులు కూడా ఉండటంతో గృహోపకరణాలు పాడవుతున్నాయి. తరచుగా కరెంటు వస్తూ, పోతూ ఉండటంతో ఇండ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర విద్యుత్ వస్తువులు చెడిపోతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు, తీసుకుని గతంలో మాదిరి నిరంతరం కరెంటు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ సరఫరాలో ఏనాడూ డోకా లేదు. పిడుగులు పడినా, భారీ వర్షాలు కురిసినా కరెంట్ పోయిన సందర్భాలు తక్కువ. రెడ్ అలెర్ట్లోనూ సరఫరా చేసింది. నాటి ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసి, అవసరాలకు అనుగుణంగా లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసింది. 24గంటలపాటు సిబ్బంది అందుబాటులో ఉండి.. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసింది. కానీ ఇప్పుడు మళ్లీ ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు.