కోదాడ, మార్చి 24: కేంద్రం దొడ్డి దారిన తెచ్చిన వ్యాలిడేషన్ చట్టంతో పెన్షనర్లకు కష్టాలు తప్పేలా లేవు… కేంద్రం 2025 మార్చి 25న దొడ్డి దారిన పార్లమెంటులో ఆమోదించిన వ్యాలిడేషన్ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు గుదిబండగా మారింది. జనవరి ఒకటి 2026 కంటే ముందు ఉద్యోగ విరమణ పొందిన వారిని, ఆ తర్వాత విరమణ పొందిన పెన్షనర్లను వేర్వేరుగా విభజించి వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రయోజనాలు ఉంటాయని చెప్పడం అనుమానాలకు దారితీస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు పింఛన్ ఇవ్వాలా వద్దా….అనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలివేయటం పింఛన్‌దారులకు ఆశనిపాతంగా మారింది. వ్యాలిడేషన్ చట్టం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని పెన్షనర్లు పేర్కొంటున్నారు.
2026కు ముందు రిటైర్డు అయిన ఉద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు నెలలకు ఒకసారి ఇచ్చే పీఆర్సీ కరువుబత్యానికి మొండిచేయి చూసేందుకే ఈ చట్టం అమలులోకి తెస్తున్నారని పెన్షన్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు ఇచ్చే పింఛన్లు కానీ, ఆర్థిక ప్రయోజనాలు భిక్ష కాదని…. అవి వారి హక్కు అని 1982లో నకారా వాజ్యం ద్వారా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తన తుది తీర్పులో స్పష్టీకరించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. సదరు తీర్పునకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాలిడేషన్ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,64000 మంది ప్రభుత్వ పెన్షనర్లు ఉండగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15000 మంది ఉన్నారు. వ్యాలిడేషన్ చట్టానికి వ్యతిరేకంగా బుధవారం తసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలపడంతోపాటు ప్రధాన మోదీకి తమ డిమాండ్లను స్పష్టం చేస్తూ మెమోరాండాలను అందజేయనున్నారు.
చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యాలిడేషన్ చట్టం రాజ్యాంగ విరుద్ధం. ఇది విశ్రాంత ఉద్యోగుల ప్రాథమిక హక్కులను భంగం కలిగిస్తుంది. జనవరి ఒకటి 2026 కంటే ముందు ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లకు ఎలాంటి ఆర్సీడీఏ వర్తించకుండా చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది.2026 తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారికి మాత్రం వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రయోజనాలు ఉంటాయని చెప్పడం అనుమానానికి దారితీస్తుంది. ఈ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకునే దాకా ఉద్యమిస్తాం.
-రావెళ్ల సీతారామయ్య, విశ్రాంత ఉద్యోగులు సంఘం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు
చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యాలిడేషన్ యాక్టును తక్షణమే రద్దు చేయాలి. ఈ చట్టం దురుద్దేశంతో కూడుకున్నది. ఎలాంటి షరతులు లేకుండా చట్టాన్ని రద్దు చేయాలి. ఉద్యోగులను, పెన్షనర్లను విభజించి చూడటం అన్యాయం. కేంద్ర ప్రభుత్వానికి ఇది ఏ మాత్రం తగదు. ఇలాంటి ద్వంద్వ విధానాలు అవలంబించడం వల్ల కేంద్రం తగిన మూల్యం చెల్లించకతప్పదు. కొందరికి పీఆర్సీ, డీఏ ప్రయోజనాలు వర్తించే విధంగా చేయడం, మరికొందరికి లేకపోవడం విభజించి, పాలించటానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.
-ఎంఎస్ ఎన్ రాజు, హుజూర్నగర్ మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం అసోసియేట్ అధ్యక్షుడు
పింఛన్ విధానాన్ని ఎత్తివేసేందుకే..
క్రమక్రమంగా విశ్రాంత ఉద్యోగులకు పింఛన్ విధానాన్ని ఎత్తివేసేందుకే కేంద్ర ప్రభుత్వం 2025 వాలిడేషన్ చట్టాన్ని అమలు చేసేందుకు సమాయత్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విధానాన్ని అమలు చేసేందుకు పూనుకోవడంతో పెన్షనర్లకు మరింత నష్టం జరుగుతోంది. భవిష్యత్తులో పీఆర్సీ కరువు భత్యానికి కూడా మొండి చేయి చూపుతాయి. ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు ప్రజాస్వామ్య శక్తులు కలిసి రావాలి.
-బొల్లు రాంబాబు, విశ్రాంత ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు