సమైక్య పాలనలో వానకాలం సీజన్లో అన్ని పంటల సాగు కలిపి 10లక్షల ఎకరాలు దాటిందంటే ఎంతో గొప్పగా అనిపించేది. ఇక యాసంగిలో మూడు నాలుగు లక్షల ఎకరాల సాగు కూడా గగనంగానే ఉండేది. కానీ స్వరాష్ట్రంలో ఏటికేడు పంటలసాగు గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. గతేడాది యాసంగిలో 9.83లక్షల ఎకరాల సాగు రికార్డు అనుకుంటే ఈ యాసంగిలో ఆల్ టైం గ్రేట్‌గా నిలిచింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుత సీజన్లో 13.14లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగువుతున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఇందులో ఒక్క వరి పంటనే 12.86 లక్షల ఎకరాల్లో ఉంది.
గతేడాదితో పోలిస్తే అదనంగా 3.54లక్షల ఎకరాల్లో వరి సాగు పెరిగింది. సాధారణానికి మించి వర్షాలతోపాటు భూమిపై పడిన ప్రతి వర్షపు చుక్కనూ ఒడిసి పట్టేలా నీటి వనరుల పటిష్టత, సాగునీటి ప్రాజెక్టుల్లో సమృద్ధిగా నీటి నిల్వలు, పైపైకి ఎగబాకుతున్న భూగర్భజలాలకు తోడు ఉచిత కరంటు, రైతుబంధు, పంటల కొనుగోళ్ల లాంటి పథకాలతో సర్కార్ వెన్నుదన్నుగా నిలిచింది. దాంతో ఉమ్మడి జిల్లా పంటల సాగులో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది.
– నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి23(నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ జిల్లా వెనుకబాటుకు నిదర్శనంగా ఉండేది. కరువు కాటకాలతో భూములు బీళ్లుగా మారి, రైతులు, కూలీల వలసలే కనిపించేవి. కానీ నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో సాగులో రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తున్నది. అన్ని పంటలతో పాటు ప్రత్యేకంగా వరి సాగులో ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్నింటికంటే ముందున్నది. ఓ వైపు కృష్ణా, మరోవైపు గోదావరి జలాలు, మధ్యలో మూసీ ఆయకట్టుతో ఎటూ చూసినా పంట పొలాలతో పచ్చదనం పర్చుకున్నది. సాధారణంగా యాసంగిలో అంతంత మాత్రంగానే ఉండాల్సిన వరి సాగు ఈ సారి మాత్రం ఆల్‌టైం రికార్డుగా నిలుస్తున్నది. ప్రభుత్వం విడుదల చేసిన యాసంగి సాగు లెక్కల్లో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా..
ఈ యాసంగిలో అన్ని పంటలు కలిపి ఉమ్మడి జిల్లాలో 13.14 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. నల్లగొండ జిల్లా 5.55 లక్షల ఎకరాలతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో, సూర్యాపేట జిల్లా 4.74 లక్షల ఎకరాలతో మూడో స్థానంలో నిలిచింది. యాదాద్రి జిల్లాలో 2.84 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాది యాసంగిలో ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 9.83 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈ సారి అదనంగా 3.30 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. గతంతో పోలిస్తే ఈ యాసంగి సాగు విస్తీర్ణం పెరుగుదలలో రాష్ట్ర సగటు 139.67 శాతం ఉంటే నల్లగొండ జిల్లా 153.05 శాతం, సూర్యాపేట 138.04 శాతం, యాదాద్రి జిల్లా 172.02 శాతం కావడం విశేషం.
వరి సాగులో అగ్రగామి
యాసంగి వరిసాగులో ఉమ్మడి జిల్లా అగ్రగామిగా నిలిచింది. మొత్తం 12.86 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గతేడాది ఇదే సీజన్లో 9.32 లక్షల ఎకరాల్లోనే సాగైనట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో సాధారణ విస్తీర్ణం 8.36 లక్షల ఎకరాలు. ఈ సారి 50 శాతం అదనంగా వరి సాగైనట్లు తెలుస్తున్నది. నల్లగొండ జిల్లా 5.31లక్షల ఎకరాల వరిసాగుతో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలువగా.. సూర్యాపేట జిల్లా 4.71లక్షల ఎకరాలతో రెండోస్థానం ఆక్రమించింది. 2.83 లక్షల ఎకరాలతో యాదాద్రి జిల్లా రాష్ట్రంలో వరిసాగులో ఆరోస్థానం దక్కించుకున్నది. గత యాసంగిలో నల్లగొండ జిల్లాలో 3.80 లక్షలు, సూర్యాపేటలో 4.18 లక్షలు, యాదాద్రిలో 1.33 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
నల్లగొండ, యాదాద్రి జిల్లాలో ఒక్క ఏడాదిలోనే అదనంగా లక్షన్నర ఎకరాలకు పైగా వరిసాగు పెరుగడం విశేషం. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు, సాగర్ ద్వారా కృష్ణాజలాలు, మూసీ జలాలకు తోడు సంవృద్ధిగా భూగర్భజలాలు అందుతుండడంతో వరిసాగు పెరిగినట్లు స్పష్టం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ద్వారా పెట్టుబడి డబ్బులు, బోర్లు, బావుల కోసం ఉచిత కరెంట్ ఇస్తుండడంతో రైతులు వరిసాగులో దూసుకుపోతున్నారు.
సమృద్ధిగా భూగర్భజలాలు
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఉమ్మడి జిల్లాలో సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో భూగర్భజలాలకు కొదువ లేకుండా పోయింది. సాగునీటి ప్రాజెక్టుల్లో జలకళతో పాటు మిషన్ కాకతీయతో చెరువులు, కుంటల్లోనూ నీటినిల్వలు సంవృద్ధిగా ఉన్నాయి. వీటికి తోడు కురిసిన ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టే యత్నాలు సఫలీకృతం కావడంతో భూగర్భజలాలు కూడా పెపైకి ఎగబాకుతున్నాయి. పదేండ్ల క్రితం జిల్లాలో 12 నుంచి 18 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉంటే కొన్నేండ్లుగా ఐదారు మీటర్ల లోతునే అందుబాటులో ఉంటున్నాయి. జనవరిలో నల్లగొండ జిల్లాలో 5.27 మీటర్ల లోతుల్లో నీరు ఉంటే సూర్యాపేట జిల్లాలో 4.49 మీటర్లు, యాదాద్రి జిల్లాలో 4.91మీటర్ల లోతుల్లోనే భూగర్భజలాలు ఉన్నాయి. 2014లో పరిశీలిస్తే నల్లగొండలో 18 మీటర్ల లోతున, సూర్యాపేట జిల్లాలో 13 మీటర్లు, యాదాద్రి జిల్లాలో 17 మీటర్ల లోతుల్లో నీటి లభ్యత కనిపించింది. ఇదంతా సీఎం కేసీఆర్ సర్కారు తీసుకున్న చర్యల వల్లే సాధ్యమైందనేది స్పష్టమవుతున్నది.
సకాలంలో వర్షాలు
ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిశాయి. సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది. జూన్ నుంచి ఫిబ్రవరి మధ్యలో నల్లగొండ జిల్లాలో సాధారణ వర్షపాతం 704 మిల్లీమీటర్లు కాగా 776.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాలో సాధారణం 836.8 మి.మీకు 900.7 మి.మీటర్లు, యాదాద్రి జిల్లాలో 743.7 మి.మీకు 908.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీరు అందుబాటులో ఉంది. ప్రస్తుతం వేసవి దగ్గర పడుతున్నా జిల్లాలోని మెజార్టీ చెరువుల్లో జలకళ ఉట్టిపడుతుండడం విశేషం. ఈ సీజన్లో సాగైన పంటలకు అవసరమైన నీరు అందుబాటులో ఉన్నది.యాసంగిలోనూ కలిసోస్తున్న ప్రకృతికి రాష్ట్ర ప్రభుత్వ చేయూత తోడు కావడంతో రైతన్నలు సంబురంగా సాగు పనిలో నిమగ్నమయ్యారు.