పత్తి రైతులు దుఃఖంలో మునిగిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. సీజన్ ప్రారంభంలో పడిన వర్షాలను చూసి మంచి దిగుబడి వస్తుందని ఆశపడినా..ఎడతెరిపి లేకుండా పడిన ముసురుతో పంటలు దెబ్బతిన్నాయి. ఆపసోపాలు పడుతూ వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటను కాపాడుకున్నా ఫలితం లేకపోయింది. పూత, కాత దశ రాగానే దసరా ముందు వర్షాలు ముఖం చాటేయడం, వాతావరణంలో మార్పులు రావడంతో పూత, పిందె రాలిపోయింది. చేను ఎర్రబడి బెందడి రోగం రావడంతో దిగుబడి పడిపోయింది. మూడు దశల్లో పత్తి తీయాల్సి ఉండగా, ఒకటి, రెండు సార్లకే చేన్లు లూటీ అవుతున్నాయి. జనవరి వరకు పత్తితో కళకళలాడాల్సిన చేన్లు నవంబర్లోనే బోసిపోతున్నాయి.
– నేరేడుచర్ల, నవంబర్ 24
మద్దతు ధర గతేడాది కంటే వెయ్యి పెరుగడంతో ఈ సంవత్సరం రైతులు పత్తి సాగువైపు ఆసక్తి చూపారు. ఆరంభంలో పత్తి విత్తనాలు ధరలు పెరిగినా ఉత్సాహంగా సాగు చేశారు. సూర్యాపేట జిల్లాలో సుమారు 1.20లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. ఒక్కో ఎకరానికి రూ. 35వేల నుంచి రూ. 45 వరకు పెట్టుబడి పెట్టారు. వర్షాలు కూడా సమృద్ధిగా పడడంతో ఎకరాకు 12 నుంచి 16 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశపడ్డారు. కానీ వర్షాభావ పరిస్థితులు, తుఫాన్ కారణంగా ప్రస్తుతం ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల వస్తుండడంతో నిరాశ చెందుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని, అప్పులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పత్తి రైతులను కూలీల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. గతంలో పత్తి ఏరితే రోజు కూలీ రూ.250 ఇచ్చేవారు. ఇప్పుడు రోజుకు రూ. 350 నుంచి రూ. 400 ఇచ్చి తీసుకొస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. కేజీల లెక్క చెల్లిస్తే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక్కో కూలీకి సుమారు కేజీలు పత్తి తీయడంతో రూ. 500 వరకు చెల్లించడంతోపాటు వాహనాలకు అదనంగా ఖర్చు చేస్తున్నామని రైతులు వాపోతున్నారు.
సాధారణంగా మార్కెట్లో పంట ఉత్పత్తి తక్కువగా ఉంటే డిమాండ్ ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పత్తి దిగుబడి తక్కువగా ఉన్నా మార్కెట్లో ధర లేని పరిస్థితి నెలకొన్నది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం కల్పించిన రూ. 7,521 మద్దతు ధర కూడా దక్కడం లేదు. నాణ్యతలేమి, తేమశాతం అనే కొర్రీలతో వ్యాపారులు క్వింటాల్‌కు రూ. 6,500 నుంచి రూ. 7వేల లోపే ధర చెల్లిస్తున్నారు. ప్రసుత్తం సీసీఐని రంగంలోకి దించినప్పటికీ కూడా రైతులు ప్రయోజనం కలుగడం లేదు. దీంతో గ్రామాల్లో దళారులు చెప్పిన ధరకే పత్తిని విక్రయిస్తూ నష్టాలపాలవుతున్నారు. తేమ శాతం 8 నుంచి 12 శాతానికి మించితే పత్తి కొనుగోలు చేయలేమని సీపీఐ అధికారులు తెలుపుతున్నారు.
హుజూర్నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం సీసీఐ కేంద్రంలో ఎక్కువ తేమ శాతం ఎక్కువ నమోదవుతుండడంతో పత్తి రైతులు నష్టపోతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండకు ట్రాక్టరులో తెచ్చిన పత్తిలో ఉబ్బకు తేమ శాతం పెరుగుతోందని, దానినే మిషన్‌లో పెట్టి చూడడం వల్ల తేమ శాతం ఎక్కువ చూపిస్తున్నదని రైతులు చెబుతున్నారు. టక్కులో కంటే బయటకు తీసిన పత్తిలో తేమ శాతం నమోదు చేయాలని రైతులు కోరుతున్నారు.
సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించాలంటే ప్రభుత్వం ఈ విధంగా ధరలను నిర్ణయించింది. 8 శాతం ఉంటే రూ. 7,521, 9శాతం ఉంటే రూ. 7,445, 10శాతం ఉంటే రూ. 7,370. 11 శాతం ఉంటే రూ. 7,295, 12 శాతం ఉంటే రూ. 7,220 ఇస్తున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉండడంతో ఎవరికి కూడా రూ.7వేలకు మించి ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు.
పత్తిసాగుతో రైతుల పరిస్థితి పూర్తిగా దయనీయంగా మారింది. భూమి ఉన్న రైతులు ఒక ఎకరాకు రూ. 15వేల నుంచి రూ.25వేల వరకు.. కౌలు రైతులు రెట్టింపు నష్టపోతున్నారు. ఎకరాకు రూ. 45వేల వరకు పెట్టుబడి పెట్టడంతోపాటు భూ యజమానికి ఎకరాకు రూ. 13 వేల నుంచి రూ. 16వేల వరకు కౌలు చెల్లించారు. దీంతో ఎకరాకు రూ. 25 వేల నుంచి 30 వేల వరకు నష్టాల్లో కూరుకుపోతున్నారు.
ఈసారి పత్తిలో పెట్టుబడి రావడమే కష్టంగా మారింది. నేను నాకున్న రెండు ఎకరాలతోపాటు మరో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాను. ఈ సారి పత్తి విత్తనాల రేటు, ఎరువుల రేట్లు పెరిగినా వెనుకాడకుండా నాణ్యమైన వాటిని తీసుకొచ్చి వేసిన. ముసురుతో వానలు పడడంతో పంట ఆశించిన స్థాయిలో రాలేదు. పంటంతా ఎర్రబడిపోయింది. దీంతో దిగుబడి బాగా తగ్గింది. కనీసం పెట్టున పెట్టుబడులు రాక తీవ్రంగా నష్టపోయాను.
-చింతపల్లి చిన్నసైదులు, కిష్టాపురం, చింతలపాలెం మండలం