Rythu Bharosa | నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల సమయంలో గొప్ప గొప్ప పథకాలు తెస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన కాంగ్రెస్ నేతలు… అధికారంలోకి వచ్చాక కొత్త గొప్ప పథకాలేమో గానీ ఉన్న పథకాలను ఎలా ఊడగట్టాలో ఆలోచిస్తున్నట్లున్నారు. ముఖ్యంగా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు భరోసా, రుణ మాఫీ, సాగునీరు, కరెంటు సరఫరా వంటి పథకాలపై కేసీఆర్ సర్కార్ నాటి చిత్తశుద్ధి.. కాంగ్రెస్ పాలనలో కరువైంది.
అధికారంలోకి రాగానే ఎకరాకు 7,500 రూపాయల యాసంగిలో రైతు భరోసా ఇస్తామని ప్రకటించి తీరా రూ.5వేలతోనే సరిపెట్టింది. వానకాలంలో ఇవ్వాల్సిన రైతు భరోసా నేటికీ అడ్రస్ లేదు. రైతు భరోసా ఇవ్వాల్సిన సమయంలో లేని గొప్పలకు పోయి ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామంటూ అభాసు పాలైంది. అటూ పూర్తిగా రుణమాఫీ గాక, ఇటూ సాగు ఆరంభంలో రైతు భరోసా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో వానకాలంలో పెట్టుబడి సాయంగా అందాల్సిన రూ.2వేల కోట్లు నేటికీ ఉమ్మడి జిల్లా రైతాంగానికి అందలేదు.
సమైక్య రాష్ట్రంలో కునారిల్లిన వ్యవసాయాన్ని గాడిలో పెట్టేందుకు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అప్పటి సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి 24 గంటల ఉచిత విద్యుత్‌కు శ్రీకారం చుట్టారు. పంటల సాగులో కీలకమైన పెట్టుబడికి సాయంగా రైతుబంధును తీసుకొచ్చారు. 2018 వానకాలం సీజన్లో తొలుత ఎకరానికి రూ.4వేల చొప్పున, తర్వాత యాసంగి నుంచి ఎకరానికి రూ.5వేల చొప్పున.. ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి 10 వేల రూపాయల సాయాన్ని అందిస్తూ వచ్చారు.
అప్పటి నుంచి కేసీఆర్ అధికారంలో ఉన్నన్నాళ్లు రైతుబంధుకు బ్రేక్ పడలేదు. సీజన్ ప్రారంభం అవుతుందంటే చాలూ పెట్టుబడికి ఇబ్బందులు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదు బదిలీ చేసేవారు. ఇలా వానకాలంలో జూన్, జూలై నెలల్లో, యాసంగిలో నవంబర్, డిసెంబర్ నెలల్లో క్రమం తప్పకుండా రైతుబంధు డబ్బు ఒక్క పైసా లంచం లేకుండా రైతులకే నేరుగా చెందాయి. సీజన్ సీజన్‌కు కొత్తగా పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు సైతం పెట్టుబడి అందజేశారు.
కాలయాపనకే కాంగ్రెస్ పెద్దపీట
ఈ ఏడాది ఆరంభంలో ఇవ్వాల్సిన యాసంగి రైతు భరోసా మొత్తాన్ని కాంగ్రెస్ పెంచలేకపోయింది. కేసీఆర్ సర్కారు ఇచ్చినట్లుగానే రూ.5వేలను అష్టకష్టాల మీద ఇచ్చి చేతులు దులుపుకొన్నది. వానకాలంలోనైనా ఎకరాకు రూ.7,500 రైతుభరోసా అందుతుందని రైతులు ఆశించారు. కానీ, కాంగ్రెస్ సర్కార్ మొండిచేయ్యి చూపుతున్నది. రైతుబంధులో అనర్హులకు పెట్టుబడి సాయం అందుతున్నటూ దాన్ని ప్రక్షాళన చేసేందుకు మంత్రులతో కూడిన కమిటీ వేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ఈ మేరకు మంత్రుల కమిటీ రైతులు, మేధావుల అభిప్రాయల సేకరణ పేరుతో హెలికాప్టర్ వేసుకుని చక్కర్లు కొట్టింది. ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అధికారులు, ప్రజాప్రతినిధులు, తమ అనుకూల రైతులతో చర్చించారు. రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వగానే అసెంబ్లీలో చర్చించి రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని చెప్తే రైతులు నిజమేనని నమ్మారు.
మంత్రులు పర్యటించి వెళ్లి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ నివేదిక లేదూ… అసెంబ్లీలో చర్చ లేదు. ఇప్పుడు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సాగు చేసిన పంటలకే రైతుభరోసా ఇస్తామంటూ మరోకొత్త డ్రామాకు తెరలేపారు. పంటల సాగుపై లెక్కలు తేల్చేందుకు డిజిటల్ క్రాప్ సర్వేకు ఆదేశాలిచ్చారు. కానీ దీనికి క్షేత్రస్థాయిలోని వ్యవసాయ విస్తరణ అధికారులు సహాయ నిరాకరణ చేస్తుండడంతో ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు రైతుభరోసా ఇస్తారో అన్నది తేలడం లేదు. ఏలా వీలైతే అలా కాలయాపన చేసేందుకే కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.11,700 కోట్లు ఇచ్చిన కేసీఆర్
2018 వానకాలం సీజన్ నుంచి రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్.. వరుసగా మొత్తం 11 సీజన్లల్లో క్రమం తప్పకుండా కచ్చితంగా అందజేస్తూ వచ్చారు. 2018 వానకాలం సీజన్ నుంచి మొదలుపెట్టి ఎకరానికి ఐదు వేల చొప్పున ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి 10వేల రూపాయల సాయాన్ని అందించారు. అప్పటి నుంచి 2023 వానకాలం సీజన్ వరకు ఎన్నడూ రైతుబంధు ఆగలేదు. మొత్తం వరసగా 11 సార్లు రైతుబంధు ద్వారా ఉమ్మడి జిల్లా రైతులకు రూ.11,700 కోట్ల రూపాయల నగదును కేసీఆర్ సర్కార్ పంపిణీ చేయడం విశేషం.
ఇన్ని కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి పక్కదారి పట్టకుండా ప్రతి పైసా నేరుగా రైతులకే చెందేలా అత్యంత పకడ్బందీగా పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసింది. ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ లంచం ఇవ్వకుండా నేరుగా రైతులకే చెందాయంటే అందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధే కారణం. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కాక మోసం చేస్తున్నదని రైతులు, రైతుసంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
రూ.2వేల కోట్ల భరోసాకు ఎగనామం
తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.7,500 చొప్పున రైతు భరోసా ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఒక్కో సీజన్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు రూ.2వేల కోట్ల వరకు పెట్టుబడి సాయంగా అందాల్సి ఉంది. కేసీఆర్ సర్కార్‌లో 11 లక్షల మంది రైతులకు ఒక్కో సీజన్లో రూ.1,300 కోట్ల వరకు రైతుబంధు డబ్బు అందేది. ప్రస్తు తం ఎకరాకు రూ.7,500 రైతుభరోసాగా అందజేస్తే.. మరో 50శాతం అదనంగా లబ్ధి చేకూరాల్సి ఉంది. కానీ నేటికీ దీనిపై స్పష్టత లేకపోవడం వల్ల వానకాలంలో రైతుభరోసాగా అందాల్సిన రూ.2వేల కోట్లకు రేవంత్‌రెడ్డి సర్కార్ ఎగనామం పెట్టినట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కౌలు రైతులు కూడా కాంగ్రెస్ సర్కార్‌పై ఈ సీజన్ నుంచే ఆశలు పెట్టుకున్నారు. తమకు కూడా ఎకరాకు రూ.7,500 వస్తాయని భావించారు. వీరి ఆశలు కూడా అడియాశలే అవుతున్నాయి.