తిరుమలగిరి, జూలై 10: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల భర్తీ ఓటర్లకు సవాల్‌గా మారింది. ప్రధానంగా 2002 ఓటరు జాబితా తప్పనిసరి కావడంతో గ్రామీణ ఓటర్లకే కాకుండా పట్టణ వాసులకూ ఇబ్బందులు తప్పడం లేదు. 24 ఏండ్ల క్రితం నాటి ఓటరు సంఖ్య ఎపిక్ నంబర్, సీరియల్ నంబర్, పోలింగ్ స్షేషన్ తదితర వివరాలు తెలియక అమోమయానికి గురువుతున్నారు. ప్రజలకు సందేహాలు బోలేడు.. సందేహాలను నివృత్తి చేసేవారు కరువు అన్న చందనంగా మారింది ప్రస్తుత పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,8,252 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 9,66,428 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేశారు.
నియోజకవర్గాల వారీగా పంపిణీ చేసిన ఫారాలు
జిల్లా వ్యాప్తంగా తుంగతుర్తిలో 98.82, సూర్యాపేటలో 95.03, కోదాడలో 93.74, హుజూర్‌నగర్‌లో 95.63 శాతం ఫారాలు పంపిణీ చేశారు. సర్‌పై ప్రజలకు పూర్తి అవగాహన లేకపోవటంతో బీఎల్వోలు కూడా ఇబ్బంది పడుతున్నారు. 2002 జాబితాలో పేరు లేకపోతే ఓటు పోతుందా అనే భయం ఓటర్లలో నెలకొంది. చదువుకున్న వారు సైతం ఫారాలు నింపడంలో బీఎల్వోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ఓటర్లు అందుబాటులో లేక ఫారాలు పంపిణీ బీఎల్వోలకు తలనొప్పిగా మారింది.
సమస్యగా నియోజకవర్గాల పునర్విభజన
2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కూడా సమస్యగా మారింది. అప్పట్లో తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు ప్రస్తుతం సూర్యాపేట నియోజకవర్గంలో ఉండటంతో 2002 వివరాలు గుర్తించటం సమస్యగా మారింది.
గ్రామీణ ప్రజలకు తల నొప్పిగా సర్ ప్రక్రియ
గ్రామీణ ఓటర్లు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడంతో ఫారాల పంపిణీ పూర్తి కావడం లేదు. 2002లో పేరు ఉన్నవారు, లేనివారు ఎటు వైపు ఫారమ్ నింపాలో అర్ధం కావడం లేదు. నిరక్షరాస్యులు ఫారాలు చేతబట్టి బీఎల్వోల చుట్టూ తిరుగుతున్నారు. ఫోన్లు చేసి నింపే విధానం తెలుసుకుంటున్నారు.
ఎస్ఐఆర్తో నా ఓటు ఉంటుందో.. పోతుందో?
నాది తుంగతుర్తి. నా వయస్సు 80 సంవత్సరాలు. నేను 2023లో అసెంబ్లీ, పార్లమెంట్, ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న. 2002 ఓటరు లిస్టులో నా పేరు లేదు. తండ్రి, లేక భర్త ఎపిక్ నెంబర్ వేసి ఫారం నింపుదామంటే వాళ్లు చనిపోయి 40 సంవత్సరాలు గడిచింది. నా ఓటు ఉంటుందో.. పోతుందో? తెలియడం లేదు.
-తడకమళ్ల యల్లమ్మ, తుంగతుర్తి