ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి తెలంగాణ ద్రోహులని, అభివృద్ధి నిరోధకులని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎడమ కాల్వను ఎండబెట్టి నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రాకు అక్రమంగా నీటిని తీసుకుపోతుంటే ఏనాడూ నోరు మెదపలేదని విమర్శించారు. ఎవరికి వారే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చెప్పుకొనే ఆ ముగ్గురు నల్లగొండ జిల్లా రైతాంగానికి చేసిందేమీ లేదన్నారు. శనివారం మిర్యాలగూడ మండలం అవంతీపురం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ ఎంసీ కలిసి ఎంపీ బడుగుల పాల్గొని మాట్లాడారు. టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి దమ్ముంటే వ్యవసాయానికి మూడు గంటలే కరంట్ ఇస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని ఎమ్మెల్యే భాస్కర్‌రావు సవాల్ విసిరారు. మూడు గంటలు కరంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలో, 24 గంటలు ఉచిత కరంట్ ఇస్తున్న కేసీఆర్ పాలన కావాలో రైతులు ఆలోచించాలని కోరారు.
– మిర్యాలగూడ, జూలై 15
మిర్యాలగూడ, జూలై 15 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న కుందూరు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ ద్రోహులని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ఆరోపించారు. శనివారం మిర్యాలగూడ మండలం అవంతీపురం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డిలతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రాకు అక్రమంగా నీటిని తరలించినప్పుడు మంత్రులుగా ఉన్న జానారెడ్డి, ఉత్తమ్‌రెడ్డి, కోమటిరెడ్డి ఏరోజూ కూడా ఆంధ్రా నాయకులను ప్రశ్నించలేదన్నారు.
తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టింది నల్లగొండ కాంగ్రెస్ నేతలేనని విమర్శించారు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ తామే ముఖ్యమంత్రి అభ్యర్థులమని ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటున్నారని, జిల్లాలో రైతుల అభివృద్ధికి వారు చేసింది శూన్యమన్నారు. ఆ పార్టీలో అందరూ ముఖ్యమంత్రులేనని, 15 రోజులకోసారి సీఎంను మార్చినా సమయం సరిపోదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛన్ అందిస్తామని ప్రకటిస్తున్నారని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కేవలం రూ.500, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రూ.600 మాత్రమే పింఛన్ ఇస్తున్నారన్నారు. అక్కడ ఇచ్చే దమ్ము లేని కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మోసపూరిత మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు.
3 గంటలు కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాలి : ఎమ్మెల్యే భాస్కర్‌రావు
ఏనాడూ వ్యవసాయం చేయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సాగుకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు గంటలు కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ కావాలో… 24 గంటల కరెంట్ ఇస్తున్న సీఎం కేసీఆర్ పాలన కావాలో ప్రజలు నిర్ణయించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల పట్ల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాదిన్నరలోనే కరెంట్ కష్టాలను తీర్చి రైతులకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించి అండగా నిలిచిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. 9 ఏండ్ల కాలంలో 18 సార్లు పంటకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. త్వరలోనే గోదావరి నీళ్లను జిల్లాకు తెప్పించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలు మూడోసారి సీఎం కేసీఆర్‌ను గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో 1960 మందికి బీసీ రుణాలు అందిస్తున్నామని, అన్ని గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు అన్నివర్గా ప్రజలు అండగా నిలువాలని, మూడో సారి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం
మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బైరం బుచ్చయ్య, వైస్ చైర్మన్‌గా కుందూరు వీరకోటిరెడ్డితో పాటు 9మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ అధికారులు సిబ్బంది, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ చెన్నయ్య, ఏడీఏ నాగమణి, మార్కెట్ ఏడీ శ్రీకాంత్, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి శ్రీధర్, నాయకులు పాల్గొన్నారు.