యాదగిరిగుట్ట, మార్చి15: యాదగిరిగుట్టలోని వైద్య కళాశాల శాశ్వత భవనం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా లేదు. స్థలం కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం పనులను మాత్రం విస్మరించింది. గుట్టలోనే నూతన వైద్య కళాశాల భవనం నిర్మించి ఈ విద్యా సంవత్సరంలోనే అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి, ఆలేరు ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ అటకెక్కిందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. టెంపుల్ సిటీపై స్థలం కేటాయించి చదునుచేసే పనులే ఇప్పటికీ కొనసాగుతుండటంతో మరో రెండు మూడేళ్ల వరకు శాశ్వత భవనం అందుబాటులోకి రావడమనేది అనుమానంగానే ఉంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరైన కళాశాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రెండున్నరేళ్లు పూర్తి కావొస్తున్నా.. పనులు సైతం శంకుస్థాపనకు నోచుకోలేదని వాపోతున్నారు. గతేడాది జూన్‌లో తుర్కపల్లికి వచ్చి ముఖ్యమంత్రి వర్చువల్‌గా పనులు ప్రారంభించి చేతులు దులిపేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మెడికల్ కాలేజీకి మంచిరోజులు వస్తాయనే అభిప్రాయం తలెత్తుతోంది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు పెద్దపీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కృషితో అప్పటి వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో జిల్లాలోని యాదగిరిగుట్టలో మెడికల్ కళాశాలను మంజూ రు చేశారు. 2023 జూలై 6న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ జీవో నంబరు 85ను విడుదల చేసింది. 100 సీట్ల కేటాయించి, కాలేజీ ఏర్పాటు చేస్తామని, 2024 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తామని జీవోలో పేర్కొన్నారు. తిరుపతి తరహాలోనే యాదగిరిగుట్టకు వైద్య కళాశాల ఉండాలని భావించి కళాశాలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి మెడికల్ కళాశాలగా నామకరణం చేశారు.
కాలేజీ నిర్మాణానికి రూ. 183 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా పరమైన అనుమతులు కూడా మంజూరయ్యాయి. అప్పట్లోనే మల్లాపురం గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 64లో 20 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ క్రమంలో ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడంతో పనుల్లో జాప్యం జరిగింది. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభం కానున్న సీట్లను 50కి కుదించి 50 కళాశాలను ప్రారంభించింది. నీట్ షెడ్యూల్ ఆధారంగా తరగతులు ప్రారంభమయ్యాయి. యాదగిరిగుట్టలో సొంత భవన నిర్మాణానికి ఆలస్యం కావడంతో భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని పగిడిపల్లిలో ఉన్న పాత కలెక్టరేట్ భవనంలో తరగతులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం 2024-25 విద్యా సంవత్సరంలోనే కళాశాలకు గాంధీ మెడికల్ కళాశాలకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్టు, ప్రొఫెసర్ డాక్టర్ శ్రవణ్‌కుమార్‌ను ప్రిన్సిపాల్‌గా నియమించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యాదగిరిగుట్టలో శాశ్వత వైద్య కళాశాల భవన నిర్మాణానికి స్థలం కేటాయించింది. ఆలేరు ఎమ్మెల్యే సైతం పలుమార్లు ఈఏడాదిలోనే తరగతులు ప్రారంభిస్తామని చెబుతూ వచ్చారు. యాదగిరిగుట్ట టెంపుల్ సిటీపై వేద పాఠశాల పక్కనే స్థలం కేటాయించారు. సర్వే నంబర్లో 153,154,156,157,158,159లోని 20 ఎకరాల భూమిని కేటాయించినా, నిర్మాణ పనులను ఇప్పటి వరకు ప్రారంభించలేదు. టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా కేటాయించిన స్థలంలో పూర్తిగా కొండ ప్రాంతం కావడంతో పెద్దపెద్ద రాళ్లు తవ్వి భూమిని చదువును చేసే పనిలో పడ్డారు. 20 ఎకరాల భూమిని చదును చేయాల్సి ఉండగా కేవలం 5 ఎకరాలను మాత్రమే చదును చేయగలిగారు. ప్రస్తుతం ఆ స్థలాన్ని పరిశీలిస్తే భవన నిర్మాణ పనులు చేపట్టాలంటే మరో ఏడాది పట్టేలా ఉందనే అనుమానం రాకమానదు.
గతేడాది జూన్ 6న ముఖ్యమంత్రి తుర్కపల్లిలో నిర్వహించిన సభకు హాజరై రూ.183 కోట్లతో నిర్మించే వైద్య కళాశాల భవన నిర్మాణాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరంలోగా కళాశాల భవనం అందుబాటులోకి వస్తుందని హామీ కూడా ఇచ్చారు. 2026-27 విద్యా సంవత్సరంలోనే శాశ్వత వైద్య కళాశాల అందుబాటులోకి తీసుకొస్తామని పలు సందర్భాల్లో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చెప్పుకొచ్చారు. అయితే ఇచ్చిన హామీ పక్కనపెట్టి వైద్య కళాశాల ఏర్పాటును పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. అయితే సీఎం ఇచ్చిన హామీని దాదాపుగా అటకెక్కించారన్న చర్చ ఉంది.
సీఎంకు కక్షసాధింపు చర్యలపై ఉన్న ధ్యాస అభివృద్ధి పైలేదన్న చర్చ సాగుతున్నది.అప్పట్లోనే మెడికల్ కాలేజీని కొడంగల్‌కు తరలించుకుపోతారనే ప్రచారం జరిగింది. కానీ స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో తరలింపునకు పుల్‌స్టాప్ పడింది. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే వైద్య కళాశాలను ప్రారంభించాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, మంజూరు చేసిన బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే శాశ్వత వైద్య కళాశాల ప్రారంభమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గుట్టలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లావాసులకు ఎన్నో విధాలుగా మేలు జరుగుతుంది. కళాశాలకు అనుబంధంగా ఆస్పత్రి వచ్చే అవకాశం ఉంది. తద్వారా వందల మందికి నిత్యం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. సూపర్ స్పెషాలిటీ సేవలను కలుపుకొని, మొత్తం 35 రకాల వైద్య విభాగాల సేవలు అందే అవకాశం ఉంటుంది. అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్‌లు ఉంటాయి. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులోకి వస్తారు. మెడికల్ కాలేజీలతో అనుబంధంగా అనేక వసతులు ఏర్పడనున్నాయి. కళాశాల ఏర్పాటుతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా వందల మందికి ఉపాధి దక్కుతుంది.