న్యూఢిల్లీ : తప్పనిసరిగా ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) పరిధిలోకి రావడానికి అవసరమైన వేతన పరిమితిని రూ.15, 000 నుండి రూ.25,000కు పెంచడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పరిమితి గత దశాబ్ద కాలంగా మార్పు లేకుండా కొనసాగుతూ వచ్చింది. ఈ సవరించిన పరిమితి అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా మరి కొంతమంది వేతన జీవులు తప్పనిసరి పీఎఫ్, పెన్షన్ పరిధిలోకి వస్తారు. ఇది ఏ తేదీ నుండి అమల్లోకి వస్తుందనేది క్యాబినెట్ ఆమోదం తర్వాత తేలుతుంది.
ఇప్పటివరకు నెలకు రూ.15,000 వరకు సంపాదిస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల భవిష్య నిధి, ఉద్యోగుల పెన్షన్ పథకం పరిధిలోకి తప్పనిసరిగా వచ్చేవారు. ఈ పరిమితిని పెంచడం వల్ల రూ.25,000 వరకు మూల వేతనం పొందే ఉద్యోగులు తప్పనిసరి ప్రభుత్వ పథకం పరిధిలోకి వస్తారు. ఈ చర్య కంపెనీలు, ప్రభుత్వానికి నిబంధనల అమలు వ్యయాన్ని పెంచుతుంది.