న్యూఢిల్లీ : దేశంలో వరుస నిరసనలు తెరమీదికొస్తున్న నేపథ్యంలో ఆగస్టు 5న దేశవ్యాప్త నిరసనలకు జాతీయ పింఛనుదారుల సంఘం ఈపీఎస్95 పిలుపునిచ్చింది. ఉద్యోగ పెన్షన్ పథకం కింద నెలవారీ పింఛన్ రూ.7,500 ఇవ్వాలని.. లేదంటే ఆత్మాహుతి చేసుకోవడమే తమకున్న ఏకైక మార్గం అని పింఛనుదారుల సంఘం వెల్లడించింది.
రేపు వేలాది మంది పెన్షన్‌దారులు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతారని.. దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లోనూ నిరసనల్లో పాల్గొనాలని ఈ సంఘం కోరింది. ప్రస్తుతం నెలవారీ పింఛను రూ.1000 ఇస్తున్నారని.. 2014లో తీసుకొచ్చిన ఈ పెన్షన్ స్కీమ్‌లో సంస్కరణలు చేయాలని పింఛనుదారుల సంఘం కమాండర్ అశోక్ రౌత్ డిమాండ్ చేశారు. తాము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు చేయడంలో విఫలమైందని తెలిపారు.