యాదగిరిగుట్ట, డిసెంబర్ 20: గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వెయ్యిలోపు ఓట్లున్న గ్రామాల్లోనే కాంగ్రెస్ బెదిరింపులకు పాల్పడి గెలిచిందన్నారు. శనివారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 6 గ్యారెంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 500 నుంచి 600 ఓట్లు ఉన్న గ్రామాలను కాంగ్రెస్ గెలువొచ్చు కానీ, పెద్ద గ్రామ పంచాయతీలన్నీ బీఆర్ఎస్ కైవసం చేసుకుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో పెద్ద గ్రామాలన్నీ బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే గెలుపొందారని దయాకర్‌రావు పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 46 వేల ఓట్ల మెజారిటీతో ఓటమిపాలయ్యాయనని, ఇప్పుడు కేవలం సర్పంచులే వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలుపొందారని గుర్తు చేశారు. రెండేండ్లలో బీఆర్ఎస్కు ప్రజల మద్దతు పెరుగుతూ వచ్చిందన్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో అధికార పార్టీ ఓటమి పాలైందన్నారు. చిన్న పంచాయతీల్లో ఓటర్లను ప్రలోభాలు, బెదిరింపులు, డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ గెలుపొందారే తప్పా కాంగ్రెస్‌పై ప్రేమతో ఓట్లు రాలేదన్నారు.
కాంగ్రెస్‌ను గ్రామాల్లో నమ్మె పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలైన ఓట్ల శాతంలో సగం బీఆర్ఎస్కే వచ్చాయన్నారు. పార్టీ గర్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు బంగపాటు తప్పదని, వార్ వన్‌సైడేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. కేసీఆర్‌ను పోగొట్టుకున్న బాధ ప్రజల్లో కొట్టొచ్చిన్నట్లు కనబడుతుందన్నారు.