అనతి కాలంలోనే ఐటీ రంగంలో అద్భుత ప్రగతి సాధించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు జిల్లాల్లోనూ సాఫ్ట్వేర్ కొలువుల కల్పనకు కృషి చేస్తున్నది. ఐటీ జాబ్ అంటే బెంగళూర్కో, హైదరాబాద్ వరకో వెళ్లే పని లేకుండా స్థానికంగానే ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నల్లగొండ జిల్లాకేంద్రంలో రూ.98కోట్లతో నిర్మించిన ఐటీ హబ్ అందుకు వేదిక కానున్నది. వచ్చే నెల రెండో వారంలో ఐటీ హబ్ ప్రారంభోత్సవాకి ఏర్పాట్లు చేస్తుండగా, ఆలోపే ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు సన్నాహాలు ముమ్మురంగా సాగుతున్నాయి. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ డెవలప్ మెంట్(టాస్క్) ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటిన జాబ్ మేళా నిర్వహించనున్నారు. తొలి విడుతలో టెక్నికల్ డిగ్రీ అర్హత కలిగిన 1,080 అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఏడాదికి 2 లక్షల రూపాయల నుంచి 25 లక్షల వరకు వేతనం ఇచ్చే అంతర్జాతీయ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. మంత్రి కేటీఆర్ పిలుపుతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఐటీ యాజమాన్యాలు సైతం ఇక్కడ కంపెనీలను ఏర్పాటుచేసి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు వస్తున్నాయి.
– నల్లగొండ, ఆగస్టు 28
నల్లగొండ, ఆగస్టు 28 : ఐటీ హబ్ అనేది నల్లగొండకు ఏండ్ల నాటి కల. ఇది రెండు దశాబ్దాలుగా కలగానే ఉండగా ఏడాది కింద రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో జిల్లా కేంద్రంలో రూ.98కోట్లతో నిర్మితమైనది. ఈ ఐటీ హబ్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతో కేటీఆర్ నల్లగొండ జిల్లాలో పుట్టి పెరిగి ఇతర దేశాల్లోని పలు పరిశ్రమల్లో స్థిరపడ్డ వారిని అభ్యర్థించడంతో వారు ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ నిర్మించే ఐటీ హబ్ నుంచి వారిని మానిటరింగ్ చేస్తూ తమ పనులు చేయించుకొని వేతనం ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మన నల్లగొండ యువతకు, స్థానికంగా నిర్మించిన హబ్‌లోనే కొలువులు రానున్నాయి. ఇందుకు సెప్టెంబర్1న జిల్లా కేంద్రలోని లక్ష్మి గార్డెన్లో అర్హత కలిగిన అభ్యర్థులకు ఇంటర్యూలు నిర్వహించి ఎంపిక చేసేందుకు (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ డెవలప్ మెంట్) టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ హబ్‌లో సీటింగ్ కెపాసిటీ 1,080 కాగా తొలి దఫా దానికి అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత రెండు షిఫ్ట్‌లు చేసి మరో 1,080 మందికి కొలువులు కల్పించనున్నారు.
సొంత గడ్డపై మమకారంతో..
ఎదిగిన కొద్ది ఒదిగి ఉండటంతోపాటు ఉన్న ఊరు కన్నతల్లిని మర్చిపోవద్దు అనేది పెద్దలు చెప్పిన మాట. దానిని మన జిల్లా పారిశ్రామిక వేత్తలు ఆచరిస్తూ స్థానిక యువత ఉద్యోగాల కల్పనకు ముందుకు వచ్చారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇతర దేశాల్లో పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదిగిన వారిని టాస్క్ గుర్తించగా వారిని కాంటాక్ట్ అయిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఆ మేరకు 15 కంపెనీల ప్రతినిధులు నల్లగొండ ఐటీ హబ్‌లో ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించి జాబ్‌మేళాకు సిద్ధమయ్యారు. జాబ్ మేళాలో అభ్యర్థుల ఎంపిక జరుగనుండగా అదే నెల రెండో వారంలో మంత్రి కేటీఆర్‌చే ఐటీ హబ్ ప్రారంభించనున్నారు. వీటి నిర్వహణకు స్థానికంగా టాస్క్ క్లస్టర్ మేనేజర్ సుధీర్, ప్రోగ్రాం మేనేజర్ ప్రదీప్‌రెడ్డి బాధ్యత తీసుకున్నారు.
టెక్నికల్ డిగ్రీ అర్హత..
ఐటీ హబ్‌లో కొలువు కొట్టాలంటే 2019 నుంచి 2023 విద్యా సంవత్సరం వరకు ఏదైనా టెక్నికల్ డిగ్రీలో 50శాతం మార్కులతో పట్టా పొంది ఉండాలి. ఆయా కంపెనీలు నిర్వహించే టెస్టుల్లో తమ పనితీరును కనబరచాల్సి ఉంటుంది. మేనేజర్ స్థాయి నుంచి టెక్నికల్ డెవలపర్ వరకు పలు హోదాల్లో ఈ ఉద్యోగాల కల్పన ఉండనుండగా ఏడాదికి కనిష్ఠంగా రూ.2లక్షల నుంచి గరిష్ఠంగా రూ.25 లక్షల వరకు ఇవ్వనున్నారు. అమెరికా నుంచి వచ్చే 15 కంపెనీల ప్రతినిధులు స్వయంగా ప్రతి అభ్యర్థిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయనున్నారు. ఎంపిక తర్వాత వెంటనే జాయినింగ్ చేసుకొని పక్షం రోజుల్లోనే విధుల్లో చేరే విధంగా ఆదేశాలు ఇవ్వనున్నారు.
జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలి
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నల్లగొండలో ఐటీ హబ్ నిర్మాణం పూర్తయ్యింది. ఇప్పటి వరకు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏడాదిలోనే అందుబాటులోకి తెచ్చాం. ఇందులో రెండు వేల మంది జిల్లా వాసులకే ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే నెల 1వ తేదీన నల్లగొంలో టాస్క్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. అర్హులైన వారు హాజరై తమ ప్రతిభను చూపించి ఉద్యోగాలు పొందాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం ఓ వైపు సర్కారు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తూనే మరో వైపు ఇలాంటి ఉద్యోగాల కల్పన కోసం చర్యలు తీసుకుంటున్నది.
– కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే