సూర్యాపేట, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): వానకాలానికి సంబంధించి సూర్యా పేట జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం కొనుగోళ్లను మాత్రం విస్మరించింది. దాదాపు ఇరవై రోజులుగా అధికారులు, ప్ర జాప్రతినిధులు ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లారే కానీ ఒక్కటంటే ఒక్క గింజ కూడా కొనుగోలు చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 20శాతం అంటే 90 వేల ఎకరాల వరకు వరి కోతలు పూర్తి కాగా రైతులు తమ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలకు తరలించారు.
అయితే వర్షాల భయంతో అత్యధిక శాతం మంది రైతులు ధాన్యాన్ని మిల్లులకు తరలించి వారు ఎంత చెబితే అంత ధరకే తెగనమ్ముకుంటున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందడంతో వారి మోములో చిరునవ్వులు వెల్లివిరియగా 21 నెలల క్రితం మోస పూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వ అసమర్థ విధానాలతో ఆయా వర్గాలు కుదేలవుతున్నాయి. ప్రధానంగా రైతాంగం పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారడంతో మళ్లీ ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వద్దనేంత వరకు నీళ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, సకాలంలో ఎరువులు, విత్తనాలతో పాటు పంట పెట్టుబడి సాయం అందించడం ద్వారా కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా చేశారు. కానీ రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమో…అధికారుల అలసత్వమో తెలియదు కానీ రైతన్నలు అరిగోస పడుతున్నారు. రుణమాఫీ పూర్తి కాలేదు… రైతు భరోసాను ఆగం చేసిండ్రు… ఏదో ఒక రకంగా సాగు చేసుకుందామంటే విద్యుత్ కోత లు… ఎరువుల కోసం యుద్ధాలు…నానా కష్టాలు పడి ధాన్యం పండించి విక్రయించాలంటే కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు. గత యాసంగి సీజన్లో రైతులు దాదాపు 60 శాతం ధాన్యం అమ్ముకున్న తరువాత కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఈ సారి వానాకాలానికి మాత్రం ఆర్భాటంగా ముందుగా ప్రారంభించారే కానీ కొనుగోళ్లు మాత్రం చేపట్టడంలేదు.

తడిసి, మొలకెత్తుతున్న ధాన్యం
జిల్లా వ్యాప్తంగా దాదాపు నెల రోజులుగా 221 సన్న వడ్ల కొనుగోలు కేంద్రాలు, 117 దొడ్డు రకం మొ త్తం 338 కొనుగోలు కేంద్రాలను ప్రజా ప్రతినిధు లు, నాయకులు, అధికారులు ఆర్భాటంగా ప్రారంభించి, ఫొటోలకు ఫోజులిచ్చారు. తీరా పంట కోతలు ప్రారంభమై రైతుల చేతికి ధాన్యం వస్తుంటే కొనుగోళ్లు మాత్రం చేపట్టకపోవడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడుస్తూ మొలకెత్తుతోంది. జల్లులు పడ్డా… వర్షం వచ్చినా రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం, మొలకెత్తిన వాటిని తీసేయడమే పనిగా మారింది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి కొద్ది రోజులుగా కనిపిస్తుండటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులు బిక్కుబిక్కుమంటున్నారు.
20 రోజులుగా జిల్లాలో దాదాపు 20 శాతానికి పైగా అంటే 90 వేల ఎకరాల వరకు కోతలు పూర్తయ్యాయని వ్యవసాయ శాఖ అధికారిక లెక్కలు చెబుతుండగా బుధవారం నాటికి జిల్లాలో ఒక్క గింజ కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. తెరిచిన కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో గత్యంతరం లేక రైతులు తమ ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో మిల్లర్లు తేమ, తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారు. ధర కూడా క్వింటా ఒక్కంటికి రూ.300ల నుంచి 500 వరకు తక్కువగా ఇస్తుండటంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ధాన్యం తెచ్చి 20 రోజులైంది.. కొనుగోళ్లు లేక మొలెకెత్తుతోంది..
తుంగతుర్తి ఐకేపీ సెంటర్ను ప్రారంభించడంతో మేం పండించిన ధాన్యాన్ని 20 రోజుల క్రితం కేంద్రానికి తెచ్చాం. అయితే రేపుమాపంటూ కొనుగోళ్లను వాయిదా వేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతోంది. గతంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం ఆలస్యమైతే..ఈ సారి తెరిచినా కొనుగోళ్లు చేపట్టకపోవడం ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం కొనదల్చుకోలేదని చెబితే ఏదో ఒక ధరకు మిల్లులకైనా తీసుకెళ్లి అమ్ముకునేటోళ్లం కదా. ఇప్పటికైనా ఆలస్యం చెయ్యకుండా వెంటనే కొనుగోళ్లు చేపట్టాలి. నాటి కేసీఆర్ ప్రభుత్వమే ఎంతో మేలు. కొనుగోళ్లను వెంటవెంటనే ప్రారంభించేది.