భువనగిరి అర్బన్, ఆగస్టు 28: రైతులు గోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని, అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ఏం ఒరగబెట్టారని మాజీ ప్రభుత్వ విఫ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం భువనగిరిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 700మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతులకు రైతుబంధు, రైతుబీమా, నిరంతర కరెంట్, ఎరువులు, రుణమాఫీలు, పింఛన్లు ఇస్తే….రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ నిలిపివేశారన్నారు. పీఏసీఎస్ కార్యాలయాల వద్ద రైతులు క్యూలైల్లో చెప్పులు, ఆధార్‌కార్డు, పట్టదారు పాస్‌బుక్కులు, చివరికి పిల్లలను కూడా యూరియా కోసం లైన్ల్లో నిలబెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. కనీసం రైతులకు యూరియా అందించలేని దీనస్థితికి కాంగ్రెస్, బీజేపీ దిగజారినాయని అన్నారు. 60 శాతం యూరియా రాష్ర్టానికి ఇచ్చామని బీజేపీ అం టుంటే, కాంగ్రెస్ రాలేదనడం సరికాదన్నారుయ. వచ్చిన యూరియా మొత్తం బ్లాక్ మార్కెట్లోకి వెళ్లిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు గోస పడుతుంటే కనబడడం లేదా….చెవులకు వినపడడం లేదా… నీకు పరిపాలన చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు.
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్నింటిలోనూ విఫలమైందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయక, బీఆర్ఎస్ ఇచ్చిన పథకాలంన్నింటినీ తుంగలో తొక్కిందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రైతులు, ప్రజల పక్షాన అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, జిల్లా రైతుబంధు సమితి మాజీ చైర్మన్ కొలుపుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, మాజీ జడ్పీటీసీలు బీరు మల్లయ్య, అనురాధ, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షుడు కిరణ్‌కుమార్, జనగాం పాండు, ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నీల ఓంప్రకాశ్‌గౌడ్, ఇట్టబోయిన గోపాల్, దిడ్డికాడి భగత్, కడారి వినోద్‌కుమార్, పెంట నీతిన్, ఎనబోయిన జహంగీర్, రత్నపురం పద్మ, బల్గూరి మధుసూదన్‌రెడ్డి, జడల యశీల్గౌడ్, పుట్ట వీరేశ్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.