పెన్‌పహాడ్, మార్చి 18 : రాష్ట్రంలో అసలు పాలన ఉందా? పరిపాలించేటోడు చేతగానోడు కాబట్టే రైతుల పొలాలు ఎండుతున్నాయని మాజీ మంత్రి మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ తమకు అప్పగిస్తే మూడు రోజుల్లో రైతుల పొలాలకు నీళ్లు ఇచ్చి చూపిస్తామని దమ్ముందా రేవంత్ రెడ్డి అంటూ ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. సూర్యపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దుబ్బతండా, రత్యాతండాలో ఎండిపోయిన పంట పొలాలను మంగళవారం ఆయన పరిశీలించారు. రైతుల కష్టాలను అడిగి, జరిగిన పంట నష్టం వివరాలనూ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి రైతులకు ధైర్యం చెప్పారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేతగాని చేవలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రైతులు పొలాలు ఎండిపోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు. రైతు సమస్యలపై ప్రశ్నిస్తే, వాస్తవాలు మాట్లాడితే తనని అకారణంగా బడ్జెట్ సమావేశాల నుండి సస్పెండ్ చేసినట్లు చెప్పారు. తనను ఏదో భయపెట్టాలని చూశారని, జగదీశ్ రెడ్డి భయపడే వ్యక్తి కాదు.. పోరాటం చేసే వ్యక్తి అన్నారు. యావత్ ప్రభుత్వం కుట్రజేసి తనను అసెంబ్లీ నుంచి బయటికి పంపినట్లు తెలిపారు. పెద్ద పెద్ద రాకాసులతోనే పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. నిఖార్సయిన ఉద్యమకారుడిని తాను అన్నారు.
మళ్లీ రైతుల వద్దకే వచ్చిన.. రైతులతోనే మాట్లాడుతున్నా. వారి బాధలు అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఇవ్వాళ ఊర్లు కళ తప్పాయి. గ్రామాల్లోని ప్రజల ముఖాల్లో చిరునవ్వు మాయమైందన్నారు. ఎవరు ప్రశ్నిస్తే వారి పైన కేసులు పెట్టడం, నిర్భందించడం, భయపెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కసారి రైతుల వద్దకు వచ్చి చూడు రైతులు మీ బట్టలుడదీసి కొడతారన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి, తమ కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే రైతులు తల్లడిల్లుతున్నారు. అసలు రాష్ట్రంలో పాలన ఉందా. పరిపాలించేటోడు చేతగానోడు కాబట్టే రైతుల పొలాలు ఎండుతున్నట్లు పేర్కొన్నారు.
Jagadish Reddy : పాలకుల చేతగానితనంతోనే ఎండుతున్న పొలాలు : జగదీశ్‌రెడ్డి