సూర్యాపేట/యాదాద్రి భువనగిరి (నమస్తే తెలంగాణ)/నల్లగొండ, జనవరి 27 : రైతులకు అది చేస్తం.. ఇది చేస్తం..అని గొప్పగా ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్నదాతను అరిగోస పెడుతున్నది. కొత్తగా ఏమీ చేయకపోగా.. గతంలో సమర్థంగా అమలైన పథకాలకు కూడా పాతర పెట్టింది. ఇందుకు తార్కాణమే రైతుబంధు పథకం. అధికారంలోకి వస్తే ఏటా ఎకరాకు రూ. 15వేల పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చిన కొత్తలో కేసీఆర్ హయాంలో అమలు చేసిన పాత పద్ధతిలోనే ఎకరాకు రూ. 5వేలు మాత్రమే అందించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసింది.
అది కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇక యాసంగి సీజన్ పైసలు మొత్తానికే పత్తాలేవు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రైతులకు ఎగనామం పెట్టింది. ఇక వానకాలం సీజన్ మొత్తానికి పెట్టుబడి సాయం బంద్ చేసి రైతులను మోసం చేసింది. ఇప్పుడు మళ్లీ యాసంగి సీజన్ వచ్చినా.. ఇప్పటి వరకు ప్రభుత్వం సాయం మాత్రం దిక్కులేదు. దీంతో రైతులు చేసేదేం లేక బయట ప్రైవేట్‌లో మిత్తీలకు తీసుకొచ్చి కాలం వెల్లదీస్తున్నారు. ఈ సీజన్లో సర్వే పేరుతో సాగు చేయని భూములకు రైతు భరోసా లేదని అధికారులు తేల్చేశారు. రైతు రుణమాఫీ విషయంలోనూ అన్నదాతను రేవంత్ సర్కారు మోసింది. దాదాపు 30 శాతం మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు. ఇక రైతు భరోసా ఈ నెల 26 నుంచి రూ.7500 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత దానికి రూ.6వేలకు కుదించి అదీనూ మండలంలోని ఎంపిక చేసిన ఒక గ్రామంలోని రైతులకే ఇస్తున్నది. పథకాల అమలులో కాంగ్రెస్ పాలకులు చెప్తున్న మాయ మాటలతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో ఇలా..
నల్లగొండ జిల్లాలో 5.60 లక్షల మంది రైతులకు చెందిన 12.20లక్షల ఎకరాలకు గానూ రూ.2,750 కోట్లు (రూ.7,500 చొప్పున మూడు సీజన్లకు రూ.22,500)ఇవ్వాల్సి ఉండగా తొలి సీజన్లో రూ. 6వేల కోట్లు (రూ.5వేలు చొప్పున)మాత్రమే ఇచ్చింది. ఇంకా రూ.21వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొలి బీఆర్ఎస్ సర్కార్ 2018 వానకాలం నుంచి రైతు బంధు పేరుతో రైతులకు పెట్టుబడి సాయం అందజేసింది. తొలుత ఎకరానికి రూ.4వేలు ఇచ్చిన గత సర్కార్ ఆ తర్వాత సీజన్‌కు రూ.5వేల చొప్పున మొత్తం తొమ్మిది విడుతలు ఇచ్చింది. జిల్లాలోని 4.60లక్షల మంది రైతులకు చెందిన 12.20లక్షల ఎకరాలకు ప్రతి సీజన్లో రూ.610కోట్ల చొప్పున మొత్తం రూ.5,550కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
90వేల మందికి కాని రూ.2లక్షల రుణమాఫీ
2018 సంవత్సరంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 4.80లక్షల మంది రైతులు ఉండగా వారిలో 3.35లక్షల మంది పంట రుణాలు తీసుకున్నారు. వారిలో నాలుగు విడుతలుగా 2.45లక్షల మంది రైతులకు రూ.2,004 కోట్లు మాఫీ చేసిన సర్కార్ రెండు లక్షలకు పైన ఉన్న వారిని మిగిలిన డబ్బులు బ్యాంకుల్లో జమచేయాలని, బ్యాంకుల్లో పేర్లు, ఆధార్ కార్డులు సరిచేసుకోవాలని ఎన్నో లింక్‌లు పెట్టింది. 90 వేలు మంది రైతులు అన్నీ చేసుకున్నా వారికి మాత్రం రుణమాఫీ కాకపోవటం గమనార్హం.
సకాలంలో సాగర్ నీళ్లివ్వని సర్కారు..
బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో 2014 జూన్‌లో అధికారంలోకి వచ్చిన సమయంలో నాగార్జున సాగర్‌లో 509అడుగుల లోతులో నీరు ఉంటే ఎడమ కాల్వకు సాగు నీరిచ్చి నాటి సీఎం కేసీఆర్ ఆదిలోనే అన్నదాతల హృదయాలను గెలుచుకున్నారు. అప్పటి నుంచి ఏటా రాజీలేకుండా ఎడమ కాల్వతోపాటు ఏఎమ్మార్పీ హై లెవల్, లో లెవల్ కెనాల్స్‌కు సాగు నీరు ఇవ్వడంతో ప్రతి సీజన్లో 4.50లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యేది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సాగర్‌లో 514అడుగుల్లో నీళ్లు ఉన్నా సాగుకు చుక్క నీరు ఇవ్వకపోవడంతో గత యాసంగి మొత్తం ఆయకట్టు ప్రాంతంతోపాటు జిల్లాలో కరువు వచ్చి వరి సాగు కాలేదు. వర్షాలు పడ్డప్పటికీ వానకాలంలోనూ కాల్వలు, ప్రాజెక్టులు, మోటర్ల వద్ద ఏర్పడ్డ చిన్న మరమ్మతుల కారణంగా సాగర్ నుంచి పూర్తి స్థాయిలో నీళ్లివ్వలేదు. దాంతో చెరువులు నిండలేదు. భూగర్భ జలాలు పడిపోయాయి. పలు చెరువుల్లో నీళ్లు లేక మత్స్యకారులు చేపపిల్లలు పోయలేక పోయారు. దాంతో వారి ఉపాధికి గండిపడింది.
సూర్యాపేట జిల్లాలో..
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సూర్యాపేట జిల్లాలో ఇంకా రైతు రుణమాఫీ కావాల్సింది రూ.2,100 కోట్లు. రైతు భరోసా పేరిట కేసీఆర్ కంటే అదనంగా ఎకరాకు రూ.2,500 ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ఎన్నికల అనంతరం తొలి యాసంగికి రూ.200 కోట్లు ఇచ్చి ఆ తర్వాత వానకాలం సీజన్ ఎగ్గొట్టింది. వాస్తవానికి రేవంత్ సర్కార్ పెంచి ఇస్తానన్న రైతుబంధు జిల్లా రైతులకు దాదాపు రూ.600 కోట్ల వరకు బాకీ ఉంది.
కాళేశ్వరంపై అక్కసుతో పంటలు ఎండబెట్టిన సర్కారు
2018 సంవత్సరానికి ముందు సూర్యాపేట జిల్లాలో 2.73 లక్షల ఎకరాలకు మించి వరి పండకపోగా తదనంతరం 2023 వరకు ఏటా రెండు సీజన్లకు ఒక్కో సీజన్‌కు 4.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలి యాసంగిలోనే కాళేశ్వరంపై విషం కక్కుతూ దానిని పక్కన పెట్టడంతో గత యాసంగిలో గోదావరి జలాల విడుదల లేక ఎస్సారెస్పీ ఆయకట్టులో దాదాపు లక్షకు పైనే ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. నాగార్జునసాగర్ ఆయకట్టులో పొట్టకు వచ్చిన పంటలకు నీటిని విడుదల చేయకపోవడంతో మరో 70వేల ఎకరాల వరకు ఎండిపోయింది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు వారి ప్రాంతానికి సాగర్ నుంచి నీటిని అక్రమంగా తరలించుకుపోవడం వల్లే నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో సాగునీటి సమస్య ఎదురైందనేది అందరికీ తెలిసిన విషయమే. ఖమ్మం జిల్లాకు నీటి విడుదల సమయంలో కాల్వలపై ఒత్తిడి పెరిగి రెండు చోట్ల గండ్లు పడి దాదాపు 50వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇక రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తానన్న రేవంత్ సూర్యాపేట జిల్లాలో 2.30 లక్షల మంది రైతులు రూ.3,012 కోట్లు పంట రుణాలు తీసుకుంటే నాలుగు విడుతలు కలిపి రూ.9,69 కోట్లు మాత్రమే మాఫీ చేయడం గమనార్హం.
యాదాద్రి జిల్లాలో 11,691 మందికి రుణమాఫీ ఎప్పుడో..?
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ సుమారు 8 నెలల తర్వాత జూన్ 18వ తేదీ నుంచి రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో మూడు దఫాల్లో 68,584మంది రైతులకు రూ. 553.82 కోట్లు మాఫీ చేశారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనలు, రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో జిల్లా వ్యాప్తంగా మాఫీ కాని వారి వివరాలను వ్యవసాయ శాఖ సేకరించింది. ఇందులో 17వేల మంది నుంచి సమాచారం తీసుకున్నారు. ఇందులో సుమారు 5వేల మందికి పలు కారణాలు చెబుతూ కోత పెట్టారు. అయినప్పటికీ అధికారికంగా నాలుగో విడుతలో ఇంకా 11,691 మందికి రూ. 111.65 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్నోళ్లు పై డబ్బులు చెల్లిస్తే మాఫీ చేస్తామని బ్యాంక్ అధికారులు చెప్పగా.. ఆ మొత్తానికి బయట ప్రైవేట్‌కు తెచ్చి చెల్లించారు. ఇటు ఇది మాఫీ కాక..అటు వడ్డీలు కట్టలేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
రూ.300 కోట్ల రైతు భరోసా ఎగనామం
కేసీఆర్ హయాంలో జిల్లాలో ఏటా సుమారు 2.30లక్షల మంది రైతులకు దాదాపు రూ. 300 కోట్లను రైతు బంధు పేరిట పెట్టుబడి సాయం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. 2018 నుంచి 2023 వరకు 2,33,461 మంది రైతులకు రూ.2,508 కోట్ల సాయం చేసింది. కానీ కాంగ్రెస్ సర్కారు ఓ సీజన్ మొత్తానికి పెట్టుబడి సాయం బంద్ చేసి రైతులను మోసం చేసింది. ఇప్పుడు మళ్లీ యాసంగి సీజన్ వచ్చినా.. ఇప్పటి వరకు ప్రభుత్వం సాయం మాత్రం దిక్కులేదు. ఈ సీజన్లో సర్వే పేరుతో 22వేల ఎకరాలకు రైతు భరోసా లేదని అధికారులు తేల్చేశారు.