నల్లగొండ రూరల్, నవంబర్ 3 : పల్లెల్లో ఎక్కడ నలుగురు కలిసి మాట్లాడుకున్నా కొనుగోలు కేంద్రాల్లో చక్కగా ధాన్యం కొంటలేరని. కొన్నా వెంటనే డబ్బులు పడుతాలేవని.. గత ప్రభుత్వం సకాలంలో ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసిందని, వెంటనే ధాన్యం డబ్బులు వేసిందనే ముచ్చటలే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల దసరా తర్వాత కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఎక్కడా సక్రమంగా కొనుగోళ్లు జరుగడం లేదు. ధాన్యం రాశులు మ్యాచర్ వచ్చినప్పటికీ సెంటర్లకు మిల్లులు కేటాయించ లేదు. అరకొర లారీలే రావడం, వచ్చిన లారీలను గోదాముల్లో సకాలంలో దిగుమతి చేసుకోకపోవడంతోపాటు అకాల వర్షంతో ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇలానే ఉంటే ఆగమై రోడ్డు పడుతామనే ఉద్దేశంతో రైతన్నలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని తిరిగి ట్రాక్టర్లకు ఎత్తుకొని మిల్లులకు తరలిస్తున్నారు. కొందరు రైతులు కూలీల ద్వారా ట్రాక్టర్లు నింపుతుండగా, మరి కొందరు రైతులు జేసీబీ సహాయంతో ట్రాక్టర్లు నింపి మిల్లులకు తరలించారు. నల్లగొండ మండలంలోని దండంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు 10 ట్రాక్టర్లలో 400 క్వింటాళ్ల ధాన్యం, రెడ్డి కాలనీ కొనుగోలు కేంద్రంలో 8 ట్రాక్టర్లలో 320 క్వింటాళ్ల మేర మిల్లులకు రైతులు తరలించుకున్నారు. ఇలా అయితే మద్దతు ధర రాదని తెలిసినా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటే పెట్టిన పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి ఉండదని రైతులు వాపోయారు.
హడావుడిగా ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినా కొనుగోళ్లు అరకొరగా అవుతున్నాయి. మా దండంపల్లి సెంటర్లో ఇప్పటి వరకు నాలుగు లారీలు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. నా ధాన్యం మ్యాచర్ వచ్చింది. కాంటా మాత్రం వేయలేదు. అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. దిక్కుతోచని స్థితిలో పెట్టిన పెట్టుబడి అయినా వస్తదని మిల్లులకు అమ్ముకునేందుకు ట్రాక్టర్లో తీసుకెళ్తున్నా.
– నేరటి పరమేశ్, దండంపల్లి, రైతు
మాది దండంపల్లి.. 10 ఎకరాలు కౌలుకు తీసుకొని వరిసాగు చేసినం. రెడ్డి కాలనీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసినం. 20 రోజులు అయినా కొనుగోళ్లు చేయడం లేదు. అదివారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. ఇప్పట్లో ధాన్యం కొంటరే లేదో క్లారిటీ లేదు. చేసేది ఏమిలేక నాకు నష్టం అయినా పర్లేదని జేసీబీ సహాయంతో మిల్లర్లకు తరలిస్తున్నా. గత ప్రభుత్వం హయాంలో ఇన్ని ఇబ్బందులు పడలేదు.
– పామనుగుండ్ల పరమేశ్, దండంపల్లి, రైతు