ఒకప్పుడు యాసంగిలో ప్రధానమైన పంటగా ఉన్న మక్కను ఇప్పుడు కొనేదిక్కు కరువైంది. గతంలో పంట దిగుబడులు పెద్ద మొత్తంలో వచ్చిన కారణంగా మార్క్ఫెడ్ నుంచి కొనుగోళ్లు చేసినా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తర్వాత కేంద్రాల ఏర్పాటుపై పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తున్నది. గత యాసంగి సీజన్లో మొత్తానికే ఏర్పాటు చేయకపోగా.. దళారుల దోపిడీతో రైతులు మునగాల్సి వచ్చింది. ఈ సీజన్లోనూ అదే పరిస్థితి కనిపిస్తుండగా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ సారి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆరు కేంద్రాలే ఏర్పాటు చేస్తామని మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ దళారులదే పైచేయి అవుతుందని, అగ్గువకే అమ్ముకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాసంగిలో ప్రధాన పంటగా మక్క వేసేవారు. తక్కువ నీటి వసతి ఉన్న ప్రతి ప్రాంతంలో ఆరుతడి పంట సాగు చేసేవారు. ఆ సమయంలో పెద్ద మొత్తంలో దిగుబడి వచ్చిన కారణంగా మార్కెటింగ్ శాఖతోపాటు మార్క్ఫెడ్ ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్కలు కొనుగోలు చేసేది. మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు మాత్రమే కేంద్రం కల్పించిన కనీస మద్దతు ధర లభించేది. రైతులకు లాభం జరిగేది. కానీ, ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో సాగునీటి వసతి పెరిగింది. వానకాలం, యాసంగి అని చూడకుండా రైతులు ఎక్కువగా వరి సాగుకే మొగ్గు చూపుతుండగా, రెండు మూడేళ్లుగా మక్క సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. అక్కడక్కడా సాగు చేస్తున్నా.. లక్ష్యం మేరకు దిగుబడులు రావడం లేదని అధికారులు మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం లేదు. గతంలో కొద్దో గొప్పగా ఏర్పాటు చేసినా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మక్క రైతులను పట్టించుకోవడం లేదు. గత సీజన్లో పూర్తిగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడమే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
కరీంనగర్ జిల్లాలో వీణవంక, శంకరపట్నం, హుజూరాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా సీడ్ ఉత్పత్తి కోసం మక్క సాగు చేస్తారు. ఇది కొన్ని ఉత్పత్తి కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకుని రైతులు సాగు చేస్తారు. ఇలాంటి రైతులకు బాధ లేదు. మరి కొందరు ఫౌల్ట్రీ యజమానులతో అగ్రిమెంట్ చేసుకుని మక్కలు పండిస్తారు. చాలా మంది రైతులు మాత్రం మక సాధారణంగా సాగు చేస్తారు. ఈ రకంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 4 వేల ఎకరాలకుపైగా మక్క సాగు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ సారి దిగుబడి కూడా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ముఖ్యంగా తిమ్మాపూర్, చిగురుమామిడి, గన్నేరువరం, చొప్పదండి, గంగాధర, రామడుగు, కరీంనగర్ రూరల్, కొత్తపల్లితోపాటు జమ్మికుంట మండలాల్లో మక్క ఈ సారి ఎక్కువగా సాగు చేశారు. కాస్త ముందస్తుగా సెప్టెంబర్, అక్టోబర్లో విత్తుకున్న రైతులు ఇప్పుటికే కోతలు మొదలు పెట్టారు. కానీ, ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం పది రోజుల్లో కోతలు ముమ్మరం కానున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ దళారులకే పంటను తెగనమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం మక్కలు క్వింటాలకు కనీస మద్దతు ధర 2,225 కల్పించినా.. దళారులు 1,700, రూ. 1,800కే కొనడంతో పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఈ యేడాది కేంద్రం మద్దతు ధర 2,400కు పెంచినా.. ఈ ధర దక్కడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ఈ మద్దతు ధర లభిస్తుందని చెబుతున్నారు. మార్కెటింగ్ శాఖ కొనుగోలుకు ముందుకు వచ్చినా అక్కడ వ్యాపారులదే రాజ్యమవుతున్నదని, వారు పెట్టిందే ధర అన్నట్టు దోపిడీ జరుగుతున్నదని రైతులు వాపోతున్నారు. మక్క దిగుబడులు ఎక్కువగా దళారులపాలే ప్రమాదమున్నదని ఆందోళన చెందుతున్నారు.
మార్క్ఫెడ్ అధికారులు గత యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటన ఇచ్చారు. తీరా సీజన్ మొత్తంలో ఒక్క కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. ఈ సారి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 6 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. మక్క దిగుబడి ఎక్కువగా వచ్చే కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, చిగురుమామిడితోపాటు మరో రెండు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఈ కేంద్రాల ద్వారా 15 నుంచి 20 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. కానీ, కేంద్రాలు ఏర్పాటు చేసి కొనే వరకు తమకు నమ్మకం లేదని రైతులు వాపోతున్నారు. ఒక పక్క కోతలు మొదలైనా ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోతలు ముమ్మరమయ్యేనాటికైనా కేంద్రాలు ఏర్పాటు చేస్తారనే భరోసా కల్పిస్తే తక్కువ ధరకు దళారులకు విక్రయించకుండా ఉండే అవకాశముంటుంది. లేదంటే దళారులపాలయ్యే ప్రమాదముంటుంది. ఈ నేపథ్యంలో మార్క్ఫెడ్ అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు కోరుతున్నారు.