కొండమల్లేపల్లి, మే 10 : ‘అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి’ అన్నట్టుగా మారింది రైతు పరిస్థితి. రైతును రాజు చేస్తామని గొప్పలు చెబుతున్న రేవంత్ సర్కార్ వడ్లు కొనడంలో పూర్తిగా విఫలమైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకొనేందుకు కొనుగోలు కేంద్రాలకు తెస్తే కొర్రీలు పెడుతూ రేపు మాపంటూ నిర్వాహకులు చెప్పడంతో ఎదురు చుపులు తప్పడంలేదు. 20 రోజులుగా రైతులు ఉదయం, రాత్రి కొనుగోలు కేంద్రం వద్దే పడిగాపులు కాస్తున్నారు.
తరుగు పేరుతో దోపిడీ..
తరుగు పేరుతో రైసు మిల్లర్లు, అధికారులు తమను నిండా ముంచుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొండమల్లేపల్లి మండల పరిధిలో రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. ఇక్కడ ధాన్యం సేకరించి మిల్లులకు తరలిస్తే క్వింటాకు 5 నుంచి 7 కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు వాపోతున్నారు. అధికారులు పరోక్షంగా సహకరిస్తూ మిల్లర్ల దోపిడీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇక ఐకేపీ సెంటర్లలో కిలో పైగా తరుగు తీస్తున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
కనీస వసతుల్లేవు..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు కల్పించడంలో అ ధికారులు విపలమయ్యారు. మండుటెండల్లో ధాన్యాన్ని తూర్పార బట్టి శు ద్ధి చేసినప్పటీకి కొనుగోలు చేసేందుకు కొర్రీలు పెడుతున్నారని రైతులు వా పోతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ కోసం టెంట్లు, గో నె సంచులు లేవు. లారీల కొరతకు తోడు ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు బస్తాకు 40 కేజీల బదులు 42 కేజీల తూకంతో నిలువు దోపిడీ చేస్తున్నారు.
లారీలు రావు.. బస్తాలు కదలవు..
మండలంలోని బాబ్లతండా సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద రైతుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో దాదాపు రెండు వంద లారీలకు సరిపడ ధాన్యం కుప్పలు ఉన్నాయి. లారీలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగితే రేపుమాపంటూ కాలయాపన చేస్తున్నారని అన్నదాతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండె..
కొనుగోలు కేంద్రానికి వడ్లు తేస్తే పట్టించుకుంటలేరు. గన్నీ సంచులు ఇస్తలేరు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లలోనే అమ్మాలని చెబుతుంటే ఇక్కడ మాత్రం పట్టించుకోవడంలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు 5 కేజీలు చొప్పున అధికారులు తరుగు తీస్తున్నారు. తూర్పార బట్టినా తరుగు తీయాల్సిందేనని చెబుతున్నారు. తుర్పారా పట్టడానికి ఎకరాకు అదనంగా రూ. వెయ్యి ఖర్చు అవుతోంది. ఇప్పటికే 20 రోజులకు పైగా ఎదురుచూస్తున్నాం. కాంగ్రెస్ సర్కార్ రైతులను ఇబ్బంది పెడతాంది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండె. గత ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేసి, ఖాతాల్లో డబ్బులు వేసేది.
-పాక యాదమ్మ, పెండ్లిపాకల
మా కష్టం దోచుకుంటున్నరు..
కొనుగోలు కేంద్రానికి వచ్చి 15 రోజులు గడిచింది. 18 శాతం తేమ వచ్చినా కొనుగోలు చేయడంలేదు. అధికారులను అడిగితే లారీలు రాగనే కాంటా చేస్తామంటూ రోజూ అదే మాట చెబుతున్నారు. 40 కిలోల బస్తాకు 42 కిలోలు వేయడం తగదు. తరుగు పేరుతో మమ్మల్ని మోసం చేస్తున్నారు. 13 నుంచి 15 శాతం వరకు తేమ వస్తేనే కొనుగోలు చేస్తామని నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కేంద్రాల్లో జరుగుతున్న దోపిడీని అధికారులు ఆరికట్టాలి.
-వంపు వెంకటయ్య, రైతు, చింతకుంట్ల