కంఠేశ్వర్, ఆగస్టు 8: కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేశామని ఇన్చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా వెల్లడించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను చేపట్టి ముసాయిదా జాబితాను రూపొందించామన్నారు.
జిల్లాలో 1,565 పోలింగ్ కేంద్రాలుండగా, హేతుబద్ధీకరణ తర్వాత వాటి సంఖ్య 1591కి చేరిందని తెలిపారు. ఓటర్ల సంఖ్య, ఇతర అంశాలను ప్రాతిపదికగా చేసుకుని 28 పోలింగ్ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయాలని, బాన్సువాడ సెగ్మెంట్ పరిధిలోని రెండు పోలింగ్ కేంద్రాలను తొలగించాలని ప్రతిపాదించామన్నారు. కొత్త పోలింగ్ కేంద్రాలు ప్రతిపాదించిన వాటిలో ఆర్మూర్ 12, బోధన్‌లో 9, బాన్సువాడలో 1, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాలలో 3 చొప్పున ఉన్నాయని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ అమలు పురోగతిపై రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ సబ్‌కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రవీందర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.