Nagarjuna Seed Ganesha | వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలన్న సందేశాన్ని సినీ హీరో అక్కినేని నాగార్జున చాటిచెప్పారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (జీఐసీ) బృందం అందించిన పర్యావరణహిత సీడ్ గణేశుడి విగ్రహాన్ని ఆయన స్వీకరించారు. భక్తిని పర్యావరణ పరిరక్షణతో మేళవించే ఈ కార్యక్రమాన్ని, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ దార్శనికతను నాగార్జున అభినందించారు. పూజను కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగా కాకుండా పర్యావరణానికి మేలు చేసే కార్యాచరణగా మార్చే ఆలోచనను ప్రశంసించారు.
సీడ్ గణేశుడిని రూపొందించిన విధానం నాగార్జునను ఆకట్టుకుంది. సహజ మట్టి, కోకోపీట్, కొబ్బరి నారతో తయారు చేసి.. అందులో వేప, చింత వంటి స్థానిక వృక్షాల విత్తనాలను పొందుపరుస్తారు. పూజల అనంతరం ఇంట్లోనే విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవచ్చు. మట్టిలో విగ్రహం కరిగిపోయిన తర్వాత విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతాయి. వాటిని ఇళ్ల ఆవరణలు, ఉద్యానవనాలు, సామూహిక ప్రదేశాల్లో నాటుకోవచ్చు.
నదులు, చెరువులు, జలాశయాల్లో విగ్రహాల నిమజ్జనం వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు సీడ్ గణేశుడు చక్కటి ప్రత్యామ్నాయమని నాగార్జున పేర్కొన్నారు. సీడ్ గణేశను సమయోచితమైన, అర్థవంతమైన కానుకగా అభివర్ణిస్తూ, నదులు, చెరువులు, జలాశయాలపై భారం పడకుండా కుటుంబాలు వినాయకుని పూజించేందుకు ఇది మార్గం చూపుతుందని అన్నారు.
2018లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితహారం స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మలిచేందుకు కృషి చేస్తోంది. మూడు మొక్కలు నాటి.. మూడేళ్లు సంరక్షించి.. మరో ముగ్గురిని మొక్కలు నాటేందుకు ప్రోత్సహించడం ఈ కార్యక్రమంలోని ప్రధాన సందేశం.
కరోనా సమయంలో పరిచయం చేసిన సీడ్ గణేశ కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు ప్రత్యామ్నాయంగా.. పూజ అనంతరం భూమిలో కలిసిపోయి, చివరకు మొక్కగా మారే సీడ్ గణేశను ప్రజలు ఆదరించాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ పిలుపునిస్తోంది.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో సీడ్ గణేశను స్వీకరించి, పర్యావరణ పరిరక్షణకు మద్దతు తెలిపిన నాగార్జునకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృందం కృతజ్ఞతలు తెలిపింది. సినీ ప్రముఖులు, కుటుంబాలు, సంస్థలు ఈ వినాయక చవితి సందర్భంగా సీడ్ గణేశను స్వీకరించి పర్యావరణహిత పండుగకు బాటలు వేయాలని కోరింది.ఇంట్లో నిమజ్జనం రాజీ కాదు.. దైవం మొక్కగా మారి, భక్తి పచ్చదనంగా విస్తరించే ఉన్నతమైన ఆరాధన అని గ్రీన్ ఇండియా చాలెంజ్ పేర్కొంది.