Dragon | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ ఉంది. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం సినీ వర్గాల్లో చర్చకు వస్తోంది. సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్‌ను భారీ స్థాయిలో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్రత్యేకంగా ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
‘డ్రాగన్’ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సాధారణ లొకేషన్లో కాకుండా ప్రత్యేకంగా భారీ సెట్‌ను నిర్మించి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఈ సెట్లో దాదాపు రెండు వారాల పాటు వరుసగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్‌ను మాస్ యాక్షన్ అవతార్‌లో చూపించేలా ఈ ఎపిసోడ్‌ను రూపొందిస్తున్నట్లు టాక్. ఈ భారీ యాక్షన్ బ్లాక్‌కు ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఆయన పర్యవేక్షణలో ఎన్టీఆర్‌పై కీలకమైన ఫైట్స్‌ను చిత్రీకరించనున్నారని సమాచారం.
ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకమైన శైలి ఉంటుందనే విషయం తెలిసిందే. అలాంటి దర్శకుడితో ఎన్టీఆర్ వంటి పవర్ఫుల్ పెర్ఫార్మర్ కలవడంతో ఈ యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరుగుతోంది. వచ్చే నెల చివరి వారంలో ఈ భారీ సెట్లో షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్టీఆర్ ఇటీవల అనూహ్యంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ గాయానికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం తారక్ వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది. పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో రాబోయే షెడ్యూల్స్‌ను ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. డ్రాగన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను పూర్తిగా రంగులమయంగా, వైవిధ్యమైన విజువల్ టోన్‌లో చూపించనున్నారని టాక్ వినిపిస్తోంది.