Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్తోపాటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడుతాయి.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో అత్యధికంగా 9.35 సెం.మీ., ఖమ్మం జిల్లా కారేపల్లిలో 6.5 సెం.మీ. వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో ఏకంగా 13.55 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సంస్థ గణాంకాలు వెల్లడించాయి.
భారీ వర్షాల కారణంగా ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆసిఫాబాద్ జిల్లాలోని వట్టివాగు, కుమరం భీమ్ ప్రాజెక్టుల్లోకి 2,172 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు 1,378 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.