కామారెడ్డి, ఆగస్టు 8: సెల్ఫోన్ల రికవరీలో కామారెడ్డి పోలీసులు ముందుంటున్నారు. చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న ఫోన్లను ఎప్పటికప్పుడు రికవరీ చేస్తూ సంబంధీకులకు అందిస్తున్నారు. బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐర్) పోర్టల్ సాయంతో వెతికి పట్టుకుని తిరిగి అప్పగిస్తున్నారు. సీఈఐర్ పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.8.44 కోట్ల విలువైన ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందించామని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర శనివారం తెలిపారు.
గతంలో సెల్‌ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఇక అంతే సంగతి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం ఉండక పోయేది. అయితే, ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కేంద్ర టెలికాం శాఖ సీఈఐఆర్ పోర్టల్‌ను తీసుకొచ్చింది. సెల్‌ఫోన్ పోయిన బాధితులు ఫిర్యాదు చేయగానే పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. టెక్నాలజీని ఆధారంగా చేసుకుని ఆయా ఫోన్లను రికవరీ చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో ఫోన్లు పోగొట్టుకున్న వేలాది మందికి పోలీసులు అండగా నిలిచారు. ఏడాది వ్యవధిలో రూ.1.59 కోట్ల విలువైన 994 ఫోన్లు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. తాజాగా 20 రోజుల వ్యవధిలో 150 ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సెల్‌ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన చెందవద్దని, సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చన్నారు. ఈ పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.8.44 కోట్ల విలువైన ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందించామని వెల్లడించారు. గత రోజుల్లో సుమారు రూ.32 లక్షల విలువైన 150 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ సంపత్ పర్యవేక్షణలో, ఆర్ఎస్సై బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలియజేశామని, వారు జిల్లా పోలీసు ఆఫీస్‌కు వచ్చి ఆర్ఎస్సై బాలరాజ్ (87126 86114)ను సంప్రదించి, సంబంధిత వివరాలు చూపించి ఫోన్లు తీసుకోవాలని సూచించారు. ఫోన్ పోయిన వెంటనే ప్రజలు సంబంధిత ఠాణాలో ఫిర్యాధు చేయడంతో పాటు సిమ్‌కార్డును బ్లాక్ చేయాలని కోరారు. మొబైల్ ద్వారానే సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందన్నారు.